ఆంధ్రప్రదేశ్ కేబినేట్ లో ఇద్దరు మంత్రులు రాజీనామా చేసే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. తాను అనుకున్న విధంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాసన మండలి రద్దు విషయంలో కీలక అడుగు వేసారు. మండలిని రద్దు చేస్తూ సోమవారం ఉదయం కేబినేట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజే శాసన సభలో కూడా బిల్లుకి ఆమోదం తెలిపే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.
ఇక ఈ బిల్లుని కేంద్రం ఆమోదించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇదిలా ఉంటే ఇద్దరు మంత్రులు రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోసు రాజీనామా చేస్తున్నారనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. శాసన సభలో బిల్లు ఆమోదం పొందిన వెంటనే వాళ్ళు రాజీనామా లేఖలను సమర్పించే అవకాశం ఉందని అంటున్నారు.
ఇప్పటికే జగన్ వాళ్ళకు రాజీనామా చెయ్యాలని సూచించినట్టు తెలుస్తుంది. అలాగే వైసీపీకి మండలిలో వారితో కలిపి 9 మంది బలం ఉంది. వారు కూడా రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి మంత్రి వర్గం నుంచి వారు బయటకు వెళ్తే వారి స్థానంలో ఎవరు మంత్రులు అవుతారు అనేది తెలియాల్సి ఉంది. అలాగే వారికి ఏ పదవులు ఇస్తారో కూడా చెప్పాల్సి ఉంటుంది.