వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి సీఎం కేసీఆర్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు. ఇవాళ వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. భూ బకాసురుడు కేసీఆర్ అని విమర్శించారు. అడిగేటోడు లేడని సర్కారీ భూములపై దొర ఇష్టారాజ్యం నడుస్తోందని ఇవాళ ట్విట్టర్ వేదికగా వైఎస్ షర్మిల ట్విట్టస్త్రాలు సంధించారు. కావాల్సింది కాజేయడం, ఆదాయం అని ఉన్నది అమ్మేయడం ఇదే రెండు దఫాలుగా కేసీఆర్ నడుపుతున్న భూముల దందా అని వైఎస్ షర్మిల వెల్లడించారు.
తనకు నచ్చిన రేటుకే కబ్జాలు చేస్తూ ప్రజలకు మాత్రం కాంపిటీషన్ పెడుతున్నడని, జిల్లాల్లో పార్టీ ఆఫీసుల పేరిట రూ.వెయ్యి కోట్లు విలువ జేసే 33.72ఎకరాల భూములను రూ.3 కోట్లకే అప్పనంగా కొట్టేశారని ఆరోపించారు వైఎస్ షర్మిల. ఎకరం రూ.100 కోట్లు పలికే కోకాపేటలో దొర భారతీయ భవన్ కోసం రూ.3.41 కోట్లకే 11ఎకరాలు దోచేశారన్నారు. దాదాపు రూ.1100 కోట్లు విలువ చేసే భూమిని అప్పనంగా పార్టీ ఆఫీసుకు లాక్కున్నారన్నారు.. ప్రభుత్వ పనులకు పనికొచ్చే భూములన్నీ దొర సొంత పార్టీ అవసరాలకు, ఆయన బినామిలకు ఉపయోగ పడుతున్నయని ఆరోపించారు.
హైకోర్టు మొట్టికాయలు వేసినా, జనం దుమ్మెత్తిపోసినా తుడుచుకొనిపోతున్నాడు కానీ దొర గారిలో మార్పు రావడం లేదని విమర్శించారు. కేసీఆర్ పార్టీ కోసం రాయించుకున్న అత్యంత విలువైన కొకాపేట భూములను వెంటనే ప్రభుత్వ పరం చేయాలని లేదా ఎకరం రూ.100 కోట్ల లెక్కన రూ.11 వందల కోట్లను మీ పార్టీ అకౌంట్‌లో మూలుగుతున్న రూ.12వందల కోట్ల నుంచి కట్టాలని డిమాండ్ చేశారు.