అధికార పార్టీలో కొన్ని రోజులుగా నెలకొన్న తీవ్ర వివాదాలు, విభేదాలకు వైసీపీ అధినేత, సీఎం జగన్ తనదైన శైలిలో చెక్ పెట్టారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికల వేడి రాజుకుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్లు కూడా పూర్తయ్యాయి.ఇక, ప్రస్తుతం నగర పాలక సంస్థలకు, కార్పొరేషన్లకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ నాయకులు ఎక్కడికక్కడ.. తమలో తామే కీచులాడుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీలైతే.. జిల్లా పరిషత్ చైర్ పర్సన్, చైర్మన్ పదవుల కోసం పోటీ పడుతున్నారు.
ఒక, కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు అయితే.. మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల కోసం తమలో తామే పోటీ పడుతున్నారు. ముఖ్యంగా నియోజకవర్గం ఎమ్మెల్యేలు తమ కుటుంబ సభ్యులకే ఈ పదవులు ఇప్పించుకు నేందుకు పాకులాడుతున్నారు. కొందరు తమ సతీమణులను రంగంలోకి దింపితే.. మరికొందరు .. తమ బంధువులను కూడా రంగంలోకి దింపి ఈ పదవులు ఇప్పించుకోవాలని తద్వారా జిల్లాల్లో చక్రం తిప్పాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఒక్కొక్క స్థానానికి నలుగురు నుంచి ఐదుగురు వరకు పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిస్థితి వైసీపీలో రచ్చకెక్కింది.
మొత్తంగా ఈ వివాదం వైసీపీ అధినేత, సీఎం జగన్ దృష్టికి వెళ్లింది. దీంతో ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న జగన్.. స్థానిక ఎన్నికల్లో టికెట్ల నుంచి పదవుల వరకు కూడా ఏదైనా.. ఇప్పటికే నాయకులుగా ఉన్నవారికి, ప్రజాప్రతినిధులుగా చక్రం తిప్పుతున్నవారి బంధువులకు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. అంతేకాదు, ఎవరూ కూడా సిఫారసులు పట్టుకుని రావొద్దని కూడా గట్టిగా చెప్పారు. అదే సమయంలో పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారికి మాత్రం ఒకింత గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈ ఒక్క ఆదేశంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నెలకొన్న వివాదానికి చెక్ పడిందని అంటున్నారు పరిశీలకులు.