ఏపీలో అధికార వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ పార్టీకి చెందిన మంత్రులు ఊహించని విధంగా స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. ఇప్పటికే మంత్రివర్గంలో మార్పులపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంత్రి అప్పలరాజుని సిఎం జగన్ తన ఆఫీసుకు పిలిపించుకున్నారు. దీంతో ఆయన మంత్రి పదవి ఊడుతుందని ప్రచారం వస్తుంది. దీనిపై అప్పలరాజు స్పందిస్తూ..మంత్రి ఉన్నా లేకాపోయినా తాను మంత్రినే అని ఆయన వెరైటీ స్టేట్‌మెంట్ ఇచ్చారు.
ఇక ఇటీవలే మంత్రి ధర్మాన ప్రసాదరావు మగవాళ్ళు పోరంబొకులు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాజాగా వైసీపీకి ఓటు వేయవద్దనే చెప్పి ప్రతి ఒక్కరినీ శత్రువులు మాదిరిగా చూడాలని అంటున్నారు. వైసీపీకి ఓటు వేయవద్దని ఇంట్లో వారు కూడా చెప్పిన వినొద్దని, వారు మీ పై ద్వేషంతో చెబుతున్నట్లు భావించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు మంత్రి బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఓటమి తన ఫెయిల్యూర్ గా భావిస్తున్నానని, మంత్రిగా ఉండి తానే ఎమ్మెల్సీ గెలుపు బాధ్యత తీసుకున్నానని, ఎందుకు ఓడిపోయామనేది సమీక్షించుకుంటున్నామని, ఓటమికి తప్పు తనది కాదని పారిపోయే వాడిని కాదని, లోపాలను సరిద్దికుని మళ్లీ రిపీట్ కాకుండా చూసుకుంటామని బొత్స ఊహించని విధంగా ఎమ్మెల్సీ ఓటమికి బాధ్యత వహించారు.
అమరావతిలో బిజేపి నేతలపై దాడిపై కూడా బొత్స స్పందిస్తూ..అసలు బిజేపి వాళ్లపై దాడి చేయాల్సిన అవసరం తమకేముందని ప్రశ్నించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం తమకు లేదని ముందస్తు ఎన్నికలపై బొత్స క్లారిటీ ఇచ్చారు. అలాగే మంత్రివర్గంలో మార్పులు చేస్తారో లేదో జగన్ ఇష్టమని అన్నారు.