ఎలుకపోరు.. ఎలుక పోరు పిల్లి తీర్చిన చందంగా మారింది.. కృష్ణాజిల్లా తిరువూరులో రాజకీయం. ఇక్కడ రాజకీయాలు చాలా భిన్నంగా సాగుతున్నాయి. ఇక్కడి టీడీపీ నేతల మధ్య ఏర్పడిన వివాదాలు.. చిలికి చిలికి గాలివానగా మారుతుండగా.. ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు స్థానిక ఎమ్మెల్యే వరుస విజయాలతో దూసుకుపోయిన ఎస్సీ నాయకుడు కొక్కిలిగడ్డ రక్షణ నిధి. ఇక్కడ టీడీపీకి గతంలో మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు ఉన్నారు. ఈయన గతంలో 1994, 1999 ఎన్నికల్లో గెలిచి.. పార్టీని నిలబెట్టారు. అయితే టీడీపీ కేడర్‌ను ఆయన దూరం పెట్టడంతో వరుసగా మూడుసార్లు ఓడించారు.
అయితే, ఆ తర్వాత మాత్రం వైఎస్ హవాతో 2004, 2009లోనూ స్వామిదాసు ఓడిపోయారు. అదే సమయంలో చంద్రబాబు హవా.. అంతో ఇంతో ఉందని భావించిన 2014లోనూ స్వామిదాసు ఓటమిపాలయ్యారు. నియోజకవర్గంలో స్వామిదాసుకు చెప్పుకోదగ్గ కేడర్ అయితే ఉంది. గత ఏడాది ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇస్తే.. గెలుపు గుర్రం ఎక్కేవారనే ప్రచారం కూడా సాగింది. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయోగం చేశారు. ఎలాగూ వరుస ఓటములతో ఉన్న నల్లగట్లను పక్కన పెడదామని భావించి.. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కమ్ మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్‌ను రంగంలోకి దించారు.
అయితే, వరుస ఓటములు ఎదురైనా నెల్లూరులో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి చంద్రబాబు టికెట్ ఇవ్వడం, పార్టీ కోసం తన సొంత నిధులు కూడా వెచ్చించి కృషి చేసిన తనను పక్కన పెట్టడంపై స్వామిదాసు ఆగ్రహించారు. ఈ క్రమంలోనే లోపాయికారీగా జవహర్‌తో విభేదించారనే ప్రచారం అప్పట్లోనేసాగింది. ఈ నేపథ్యంలోనే గెలుపు గుర్రం ఎక్కడంపై డౌట్ ఉన్న రక్షణ నిధి సునాయాసంగా విజయం సాధించారు. ఇక, జవహర్ ఓటమి తర్వాత.. తాను తిరిగికొవ్వూరుకు వెళ్లిపోతానని ఆయన పట్టుబడుతూ.. నియోజకవర్గాన్ని వదిలేశారు.
ప్రస్తుతం జవహర్ మనస్సు అంతా కొవ్వూరు మీదే ఉంది. అదేసమయంలో కోరినెత్తిన ఎక్కించుకున్న జవహరే పట్టించుకోనప్పుడు తనకెందుకని స్వామిదాసు మౌనం వహించారు. ఫలితంగా ఇక్కడ రక్షణ నిధి పేరు దూసుకు పోతున్నారు. టీడీపీ నుంచి ఇటీవల పలువురు కీలక కార్యకర్తలను కూడా రక్షణనిధి వైసీపీలో చేర్చుకున్నారు. మొత్తానికి తన ప్రయత్నం లేకుండానే టీడీపీ నేతల కయ్యాలతో తన హవాను పెంచుకుంటున్నారు రక్షణనిధి!! ఇదీ సంగతి!