తాను ఏమి చెప్పాలనుకున్నా ముక్కుసూటిగా చెప్పే ప్రయత్నం చేసే వైకాపా నగరి ఎమ్మెల్యే రోజా… తాజాగా టీడీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల పేరు చెబితే అంతెత్తున లేచే రోజా… ఓపిక, మనసూ ఉంటే సేవ చేయండి.. లేదంటే ఇంట్లో కూర్చోండి అని సూటిగా హెచ్చరిస్తున్నారు. ఇందులో భాగంగా… తాను నెల రోజులుగా నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ తన చారిటబుల్ ట్రస్టు ద్వారా అనేక సేవలందిస్తున్నారని చెబుతున్న రోజా తనపై బురదజల్లే కార్యక్రమం చేపట్టారంటూ టీడీపీ నేతలపై ఫైరయ్యారు!
ఇదే క్రమంలో లాక్‌డౌన్ సమయాన వైసీపీ నాయకులు ఎక్కడికక్కడ ప్రజలకు సేవలందిస్తూ ఉంటే… టీడీపీ నాయకులు మాత్రం ఇళ్లలో విశ్రాంతి తీసుకుంటూ.. అనవసరంగా తమపై బురదజల్లే కార్యక్రమం చేపట్టారని ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ముందుచూపు కారణంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్న రోజా… ప్రజలకు సేవలందించకపోయినా పర్లేదు కానీ… టీడీపీ నేతలు ఇళ్లలో కూర్చుని ఉంటే చాలని.. అది వారికే మంచిదని హితవు పలికారు.
కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సాయం చేయకుండా చంద్రబాబు నాయుడు ఇంటికే పరిమితమయ్యారని.. ఈ సమయంలో ప్రజలు కష్టాల్లో ఉంటే అండగా ఉండకపోవడమే కాకుండా.. సేవ చేసే ధృక్పథంతో నిరంతరం ప్రజల మధ్యలో ఉంటున్న తన లాంటి ఎమ్మెల్యేలపై నిస్సిగ్గుగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో వాలంటరీ వ్యవస్థను సీఎం జగన్ ఏర్పాటు చేశారని ప్రశంసించారు. మంచి చేయాలనే ఉద్దేశ్యంతో సీఎం జగన్ పని చేస్తుంటే.. తమ మనుగడ కోసం ప్రతి పక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. చంద్రబాబుకి ఉన్నట్లుగా పబ్లిసిటీ పిచ్చి జగన్ కు లేదని రోజా తూర్పారబట్టారు!