కడప జిల్లా జమ్మలమడుగు రాజకీయం రసకందాయంగా మారింది. ఇక్కడ నుంచి విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డికి రోజుకో సెగ తగులుతూనే ఉంది. దాదాపు 53 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించిన సుధీర్ ఇప్పుడు నిమిత్త మాత్రుడిగా మారారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి గతంలో ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి గెలుపు గుర్రాలు ఎక్కడంతోపాటు.. ఇక్కడ ఇప్పటికీ చక్రం తిప్పుతున్నారు. దీంతో సుధీర్‌రెడ్డికి సెగ పెరుగుతోంది. ఆది నారాయణరెడ్డి గతంలో కాంగ్రెస్‌లో ఉన్నారు. రామసుబ్బారెడ్డి గతంలో టీడీపీలో ఉన్నారు. తర్వాత ఆది వైసీపీలో చేరి.. 2014లో గెలిచి, తర్వాత టీడీపీలోకి వచ్చారు.
ఇదే ఆది చేతిలో పరాజయం పాలైన రామసుబ్బారెడ్డికి, ఆదికి మధ్య చంద్రబాబు గతంలో సయోధ్య చేశారు. ఇదిలావుంటే, గత ఏడాది ఎన్నికల్లో ఆది కడప పార్లమెంటు నుంచి పోటీ చేసి ఓడిపోవడం తర్వాత బీజేపీలో చేరిపోవడం తెలిసిందే. ఇక, రామసుబ్బారెడ్డి.. టీడీపీ తరఫున జమ్మలమడుగులో పోటీ చేసి ఓడిపోయి.. తర్వాత వైసీపీలో చేరిపోయారు. కాగా, సుధీర్‌రెడ్డి వైసీపీ తరఫున విజయం సాధించారు. అయితే, ఆది, రామసుబ్బారెడ్డిలు.. ఇప్పుడు కారాలు మిరియాలు నూరుతున్నారు. అదే సమయంలో ఇరువురు నేతలతో సుధీర్‌కు పడడం లేదు. పైగా సుధీర్‌తో ఉన్న గ్రూపులో కూడా ఆయనపై వ్యతిరేకతతో ఉన్నవారు కనిపిస్తున్నారు.
ఇక రామసుబ్బారెడ్డి ఎప్పుడు అయితే పార్టీలోకి వచ్చారో అప్పటి నుంచి ఆయన హవానే నడుస్తోంది. అధికారుల బదిలీలు, కాంట్రాక్టులు, జిల్లా స్థాయి పనులు ఆయన చెప్పిన వారికే అవుతున్నాయి. దీంతో జమ్మలమడుగులో సుధీర్‌కన్నా ఎక్కువగా రామసుబ్బారెడ్డి హవా నడుస్తోంది. ఎమ్మెల్యేగా గెలవకపోయినా.. అనధికార ఎమ్మెల్యేగా ఆయన చక్రం తిప్పుతున్నారు. ఇక, సుధీర్‌ను ఎవరూ పట్టించుకోవడం మానేశారు. ఇదిలావుంటే, జమ్మలమడుగులో వైఎస్ ఫ్యామిలీ హవా ఎక్కువగా ఉంది.
చాలా మంది కార్యకర్తలు జగన్ పేరు చెప్పి పని చేయించుకుంటున్నారు. ఈ పరిణామాలకు తోడు.. సుధీర్‌పై సోషల్ మీడియాలో రామసుబ్బారెడ్డి వర్గం జగన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో సుధీర్ తర్జన భర్జన పడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఏదెలా ఉన్నప్పటికీ.. అటు ఆది, ఇటు రామసుబ్బారెడ్డిలతో సుధీర్ వేగలేక పోతున్నారని స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతుండడం గమనార్హం.