బాబు గతకొంతకాలంగా పూర్తిగా అమరావతిమీదే ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇలా ఒక పక్క అమరావతి కోసం కుస్తీలు పడుతుంటే.. మరోపక్క కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఆన్ లైన్ కే పరిమితమవుతుంటే.. ఇంకోపక్క “కుప్పంలో కాస్కో నా రాజా” అంటూ వైసీపీ ఆపరేషన్ స్టార్ట్ చేసేసింది! చంద్రబాబు పునాధులు కదిలించడమే టార్గెట్ గా ఎంచుకుంది!
అవును… కుప్పం నుంచి బాబుతో టచ్ లో ఉండే నేతలు తాజాగా ఔటాఫ్ సర్వీస్ లోకి వెళ్లిపోయారంట. దీంతో బాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు కోటకు బీటలు పడినట్లుగా తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో మొదటి రౌండ్ ఓట్ల లెక్కిపులో చంద్రబాబు కాస్త వెనుకబడిపోయారు. దీంతో అందరి గుండెళ్లో రైళ్లు పరిగెత్తాయి. దీంతో కుప్పంలో కాస్త గట్టిగా ప్రయత్నిస్తే టీడీపీ అధినేత చంద్రబాబును ఓడించడం అంత కష్టమేమీ కాదని సమాచారం అందుతుంది. అదే భావనలో “టార్గెట్ కుప్పం” ఆపరేషన్ వైసీపీ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచీ టీడీపీతో దాదాపు ముప్ఫై ఏళ్లు అనుబంధం ఉన్న నాయకులంతా ఒక్కొక్కరుగా వైసీపీలోకి జారుకుంటున్నారు. వైసీపీ ఆఫరేషన్ లో భాగంగా.. టీడీపీతో 30 ఏళ్ల అనుబంధం ఉన్న కుప్పం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ చంద్రశేఖర్ ఈ మధ్యనే సైకిల్ దిగిపోయి ఫ్యాన్ కిందకు చేరిపోయారు. చంద్రశేఖర్ భార్య ఎంపీపీగా కూడా పనిచేశారు. ఇది నియోజకవర్గం టీడీపీలో పెద్ద కుదుపుగా చెప్పవచ్చు. ఇక జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ శ్యామ్ రాజు కూడా టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఇదే క్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ సుబ్రమణ్యంరెడ్డి కూడా త్వరలో వైసీపీలో చేరతారనే టాక్ ఈ మధ్య విపరీతంగా నడుస్తోంది.
కుప్పం నియోజకవర్గంలో బీసీ ఓటర్లు ఎక్కువ. వన్నెకుల క్షత్రియ, కురబ సామాజికవర్గం వారు అధికంగా ఉన్నారు. ఆయా వర్గాలపై వైసీపీ దృష్టి సారించింది. చంద్రబాబుకు మంచి మెజారిటీ కట్టబెట్టే గుడిపల్లె మండలంపైన కూడా వైసీపీ నేతల కన్నుపడింది. ప్రస్తుతం ఈ మండలం నుంచే వలసలు సాగుతున్నాయి. కుప్పం వైసీపీ ఇంఛార్జ్ చంద్రమౌళి మరణంతో ఆయన కుమారుడు భరత్ ఆ బాధ్యతలు తీసుకున్నారు. పరిశీలకుడి హోదాలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప వచ్చి సలహాలు సూచనలు ముమ్మరంగా ఇస్తున్నారు. వీరందరినీ సమన్వయం చేసే బాధ్యత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకున్నారు. దీంతో రాబోవు ఎన్నికల్లో చంద్రబాబు పరిస్థితి మంగళగిరే అనే టాక్ వినిపిస్తోంది.
ఇదే సమయంలో చంద్రబాబు డైరెక్షన్ లో టీడీపీ కేడర్ ను కాపాడుకొనేందుకు ఎమ్మెల్సీ శ్రీనివాసులు నానా తంటాలు పడుతున్నారనే టాక్ నడుస్తోంది. కుప్పంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు జిల్లా టీడీపీ నాయకులు చంద్రబాబుకు చేరవేస్తున్నారుట. దీంతో బాబు కూడా స్థానిక నేతలతో మాటమాటికీ మాట్లాడుతున్నారని తెలుస్తోంది. అలాగే.. జూమ్ యాప్‌ద్వారా ఈ మధ్యనే బాబు స్థానిక నేతలతో మాట్లాడారని.. తాజాగా బాబు ఆదేశాలతో కుప్పం వెళ్లిన కొందరు టీడీపీ పెద్ద నాయకులతో మాట్లాడేందుకు కూడా కొందరు కుప్పం టీడీపీ నేతలు ముఖం చాటేసినట్లు కూడా తెలుస్తోంది. ఫలితంగా ఈ విషయంలో ఆ ఎమ్మెల్సీ కూడా చేతులెత్తేసినట్లుగా తెలుస్తోంది.
అంతేకాకుండా ఆ ఎమ్మెల్సీ కార్యకర్తల ఇంటికి వెళ్లి మరీ పార్టీ మారవద్దని చెప్తుంటే… ఆయన ముందు “సరే” అని చెప్పి ఆ తర్వాత మరుసటి రోజే పార్టీ మార్చేస్తున్నారంట. మరి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబు ఓటమి ఖాయంగా కేడర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో కీలకంగా ఉన్న టీడీపీ నేతలు, వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఫలితంగా కుప్పం నుంచి బాబు ఈసారి గెలవడం అసాధ్యమనే టాక్ కూడా నడుస్తోంది. ఏది ఏమైనప్పటికీ… వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ తో కుప్పం రాజకీయం రంజుగా మారిందనే చెప్పాలి.