రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో విజయం కంటే కొడంగల్ లో గెలుపే తెరాసకు ప్రతిష్టాత్మకంగా మారిందని..ఇందుకుగాను కేసీఆర్ రూ.100 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారంటూ..కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో రేవంత్ మాట్లాడుతూ.. ఇప్పటికే ఒక్కో నియోజకవర్గానికి ‘‘ముషీరాబాద్ టికెట్ తనకుగానీ, తన అల్లుడికిగానీ ఇవ్వాలని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కేసీఆర్ని కోరగా.. ఎల్బీనగర్ నుంచి పోటీ చేయి.. రూ.10 కోట్లు ఇస్తా అని సీఎం బదులిచ్చినట్లు… టికెట్ అడిగినప్పటి నుంచి నెల రోజులుగా కేసీఆర్ తనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు’ అని నాయిని ప్రస్తావించిన అంశాలను మరో సారి గుర్తు చేస్తూ.. నాయిని వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీల నేతలపై కాకుండా ముఖ్యమంత్రి ఉంటున్న ప్రగతిభవన్, వ్యవసాయక్షేత్రం, మంత్రులు కేటీఆర్, హరీశ్, ఎంపీ కవిత ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు చేయాలన్నారు. అలా చేయకపోతే కేంద్ర నిఘా సంస్థలు, ఆదాయ పన్ను శాఖలు నరేంద్ర మోదీ, కేసీఆర్ కనుసన్నల్లో పనిచేస్తున్నట్లుగానే బావించాలని పేర్కొన్నారు.