బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కేసీఆర్ తో ఉన్నారని.. ఎవరూ కాంగ్రెస్ పార్టీలో చేరరని సీనియర్ నేత, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ భవన్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం ముగిసిన తర్వాత గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ ను విడచిపెట్టి ఎవరూ వెళ్లిపోరు. కాంగ్రెస్ వాళ్లు ఒక్కరిని తీసుకెళ్తే… బిఆర్ఎస్ లోకి 10 మంది వస్తారు. మేం గేట్లు తెరిస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బిఆర్ఎస్ లోకి వచ్చే పరిస్థితి ఉంది. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. మాకు అధికారం ముఖ్యం కాదు. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం అలా మాట్లాడి ఉండొచ్చు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం ను కోరుతున్నాం. డిసెంబరు 9వ తేదీనే రైతు బంధు వేస్తామని చెప్పి , ఇంతవరకు కూడా ఇంకా ఎందుకు డబ్బులు రైతుల ఖాతాలలోకి వేయలేదు. రైతుబంధు డబ్బులను వెంటనే వేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే ఇంత వ్యతిరేకత ఎప్పుడూ చూడలేదు. అమలు సాధ్యం కాని హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్ ను సంస్థాగతంగా బలోపేతం చేయడంపై చర్చిస్తున్నాం” అని ఆయన అన్నారు.