నేడు ఏపీలో వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 340 పశువుల అంబులెన్స్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ అంబులెన్స్‌లను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. 108 అంబులెన్స్ తరహాలో ఇప్పుడు మూగజీవాలకు ఏ చిన్న కష్టమొచ్చినా ‘అంబా.. అన్న సైరన్‌తో పరుగులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి ‘డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ’ (మొబైల్ అంబులేటరీ క్లినిక్స్) రథాలు వైద్య సేవలతో పాటు అవసరమైతే సర్జరీలు చేయడమే కాదు.. కోలుకునే వరకు వాటి ఆరోగ్యాన్ని ఇవి పర్యవేక్షిస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 340 అంబులెన్స్‌లను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ఇందులో డ్రైవర్ కమ్ అటెండర్, ఒక ల్యాబ్ టెక్నీషియన్ కమ్ కాంపౌండర్, ఓ వైద్యుడు ఉంటారు.
ప్రతీ అంబులెన్స్‌లో ప్రత్యేకంగా ట్రావిస్‌తోపాటు 20 రకాల మల సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్త పరీక్షలు చేసేందుకు వీలుగా మైక్రోస్కోప్‌తో కూడిన పూర్తిస్థాయి ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు. కనీసం వెయ్యి కిలోల బరువున్న మూగజీవాలను తరలించేందుకు వీలుగా హైడ్రాలిక్ జాక్‌లిఫ్ట్ సౌకర్యం కూడా ఏర్పాటుచేశారు. పెద్ద జంతువులకు ప్రాథమిక వైద్యంతో పాటు చిన్నపాటి ఆపరేషన్లు చేస్తారు. పెద్ద సర్జరీలు అవసరమైతే మాత్రం సమీప ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలందించి పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి ఆ గ్రామానికి తీసుకెళ్లి రైతుకు అప్పగిస్తారు. వీటి కోసం 24 గంటలూ పనిచేసేలా టోల్ ఫ్రీ నంబర్ 1962ను ఏర్పాటు చేస్తున్నారు. 108లోని కుయ్ కుయ్ తరహాలో వీటికోసం ‘అంబా..’ అన్న పశువుల అరుపుతో పాటు వాటి మెడలో కట్టే మెడపట్టెడ (గంటలు, మువ్వలు) శబ్ధంతో కూడిన వినూత్న సైరన్ రూపొందించారు.