భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ సంచలనం సృష్టించాడు. శ్రీలంకతో జరుగుతున్న ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో సిరాజ్ ఈ ఫీట్ సాధించాడు. పతుం నిశ్శంక, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వలను ఈ ఓవర్లో సిరాజ్ అవుట్ చేశాడు. ఈ ఓవర్ మొదటి బంతిని పతుం నిశ్శంక బ్యాక్‌వర్డ్ పాయింట్ వైపు బంతిని ఆడబోయి జడేజాకు క్యాచ్ ఇచ్చాడు. క్రీజులోకి వచ్చిన సదీర సమరవిక్రమ రెండో బంతిని డాట్ బాల్‌గా ఆడాడు. మూడో బంతికి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. నాలుగో బంతికి చరిత్ అసలంక కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఐదో బంతిని ధనంజయ డిసిల్వ బౌండరీకి తరలించాడు. చివరి బంతికి ధనంజయ కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో శ్రీలంక 12 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.
సిరాజ్ సంచలన బౌలింగ్ ప్రదర్శనపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. తాను ఏనాడూ ప్రత్యర్థి జట్ల పరిస్థితి పట్ల బాధపడలేదని, కానీ ఇవాళ సిరాజ్ బౌలింగ్ చూశాక శ్రీలంక పరిస్థితి అయ్యో పాపం అనిపించిందని తెలిపారు. శ్రీలంకపై ఏదో ఒక మానవాతీత శక్తి విరుచుకుపడినట్టుగా అనిపించిందని, సిరాజ్ నువ్వు నిజంగా మార్వెల్ అవెంజర్ అంటూ ఆనంద్ మహీంద్రా కొనియాడారు.