విమోచనం పై అమిత్ షాతో పాటు కొంతమంది లేని అపోహలను సృష్టించడం దురదృష్టకరం అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం సూర్యాపేటలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాత గాయాలను రగిలించి సమాజాన్ని చీల్చాలనే దుర్మార్గానికి పాల్పడుతున్న అలాంటి వారు దేశ మనుగడకు చాలా ప్రమాదకరం అన్నారు.
ఓట్ల రాజకీయ ప్రయోజనం కోసం ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. అన్నదమ్ముల్లా కలిసి ఉన్నా తెలంగాణ సమాజంలో చిచ్చు పెడితే సహించేది లేదన్నారు. ఎన్ని కుట్రలు చేసినా సీఎం కేసీఆర్ నాయకత్వంలో కుట్రలను తిప్పికొట్టే చైతన్యం తెలంగాణా ప్రజలు ఉందని పేర్కొన్నారు. అన్యాయాలు, అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర తెలంగాణకు ఉందన్నారు.
కర్ణాటకలో ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్ చరిత్ర ఏమిటో ప్రజలందరికీ తెలుసని చెప్పారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఎన్ని చెప్పినా ప్రజలు వినే పరిస్థితిలో లేరని అన్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఆ పార్టీ పగటి కలలు కంటోందని ఎద్దేవా చేశారు.