పెద్దవాళ్ల కాళ్లు ఎందుకు మొక్కాలంటే..?

-

మనం ఎవరైనా పెద్దవాళ్ల ఇంటికి వెళ్లినప్పుడో లేదా ఎవరైనా పెద్దవాళ్లు మన ఇంటికి వచ్చినప్పుడు మన అమ్మానాన్న వారి కాళ్లకి దండం పెట్టమని చెబుతుంటారు. దసరా పండుగకు పెద్దవాళ్ల చేతిలో జమ్మి పెట్టి వారి కాళ్లు మొక్కడం ఓ ఆనవాయితీ. అయితే పెద్దవాళ్ల కాళ్లని మొక్కడం వెనుక ఓ పెద్ద స్టోరీ ఉంది. అసలు వారి కాళ్లు ఎందుకు మొక్కాలి..? అలా పెద్దవాళ్ల పాదాలకు నమస్కరించడం వల్ల ఉపయోగాలు ఏంటి..? కాళ్లకు నమస్కరించడం దేనికి సంకేతమో తెలుసుకుందామా..!

పెద్దవాళ్లు.. మనకంటే ఎక్కువ కాలం బతికారు. అంటే వాళ్లు ఎంతో అనుభవాన్ని గడించారు. వాళ్ల అనుభవానికి.. వారు వారి జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్లకు.. వాటిని అధిగమించి తమ జీవితాన్ని హాయిగా జీవిస్తున్నందుకు వారి పాదాలకు నమస్కరించాలి.

పెద్ద వాళ్ల పాదాలకు నమస్కరించడమంటే.. మన అహాన్ని వదిలి పెద్దల మార్గాన్ని అనుసరిస్తున్నామని అర్థం. అంటే మనల్ని మనం తక్కువ చేసుకోకుండా.. వారి అనుభవానికి.. వారి వయస్సుకి గౌరవం ఇవ్వడం. వారి అనుభవాలను మన జీవితంలో రాబోయే సంఘటనలకు అనునయించుకుని మెరుగ్గా జీవించడం ద్వారా వారి పట్ల మన గౌరవాన్ని తెలియజేయడం.

పెద్దవాళ్ల పాదాలపై మన తల ఆనించడం అంటే.. మన జ్ఞాన భాండాగారమైన తలను వారి పాదాలకు తాకించడం. దాని అర్థం.. మన జ్ఞానాన్ని వారి అనుభవాలతో అనుసంధానం చేస్తున్నట్లు అని పండితులు చెబుతారు. ఇది వారి అనుభవానికి మనం ఇస్తున్న గౌరవాన్ని సూచిస్తుందని అంటుంటారు.

కేవలం సాంప్రదాయ కారణాలే కాకుండా పెద్దవాళ్ల పాదాలకు నమస్కరించడం వల్ల కొన్ని ఆరోగ్యకరమైన ఉపయోగాలు కూడా ఉంటాయి. అవేంటంటే..

పెద్దవాళ్ల కాళ్లకు నమస్కరించినప్పుడు నరాలు.. మెదడను వ్యాపించి చేతులు కాళ్ల వేళ్ల చివర్లలో ముగుస్తాయి. పాదాలకు నమస్కరించినప్పుడు పెద్దవారి పాదాలు శక్తినిస్తాయని.. చేతివేళ్లు ఆ శక్తిని గ్రహిస్తాయని అంటారు. పెద్దవారి హృదయం నుంచి సానుకూల శక్తితో నిండిన తరంగాలు ఆ పాదాల కొనల నుంచి చేతుల ద్వారా నమస్కరించే వారి శరీరంలోకి చేరతాయని చెబుతారు.

పెద్దవాళ్ల పాదాలకు నమస్కరించినప్పుడు ఎడమ చేతిని ఎడమ కాలిపై.. కుడి చేతిని కుడి కాలిపై పెట్టి నమస్కరించడం అనేది సరైంది కాదని పండితులు చెబుతుంటారు. అలా కాకుండా.. కుడిచేతిని వారి ఎడమకాలిపై, ఎడమచేతిని కుడికాలిపై పెట్టి ఆశీర్వచనం తీసుకోవాలని అంటుంటారు.

వంగి పాదాలను తాకడం, మోకాళ్లపై కూర్చుని నమస్కరించడం, నుదురు నేలను తాకించి చేసే సాష్టాంగ ప్రణామం వల్ల ఉపయోగాలున్నాయని ఆయుర్వేదం చెబుతోంది. వీటి ద్వారా వెన్ను, నడుము, మోకాళ్లు వంగి శరీరంలోని కీళ్లన్ని సాగుతాయి, నరాలు, మెదడులోని నాడులన్నీ ఉత్తేజితం అవుతాయి. ఫలితంగా శారీరక, మానసిక ఆరోగ్యం సుస్థిరంగా ఉంటుంది. మొత్తానికి పెద్దవాళ్ల పాదాలకు నమస్కరించడం అనేది కేవలం గౌరవ సూచికగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఉపయోగపడుతుంది అన్నమాట.

 

Read more RELATED
Recommended to you

Latest news