కరోనా ప్రభావం ప్రారంభమైనప్పటి నుంచి పరిశోధకులు ఆ వైరస్‌పై పోరాటం చేసేందుకు క్యూర్‌ను కనిపెట్టే ప్రయత్నంలోనే ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పటికే కోవిడ్ (Covid19) బారిన పడిన వారిని రక్షించేందుకు అనేక మందులు, సహజసిద్ధమైన పదార్థాలపై వారు ప్రయోగాలు చేశారు. కొన్ని కరోనాపై పోరాడేందుకు ఉపయోగపడతాయని తేలడంతో ఆ మందులను చికిత్స కోసం వాడుతున్నారు. అయినప్పటికీ పరిశోధకులు మాత్రం తమ ప్రయత్నాలను మానలేదు. ఇక గ్రీన్ టీలో ఉండే పలు సమ్మేళనాలు కోవిడ్‌పై పోరాటం చేస్తాయని సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనాల్లో వెల్లడైంది.
ఊటీకి చెందిన జేఎస్ఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, స్వన్‌సీ యూనివర్సిటీ మెడికల్ స్కూల్‌కు చెందిన పరిశోధకులు కోవిడ్ చికిత్సకు గ్రీన్ టీలో ఉండే సమ్మేళనాలపై అధ్యయనం చేపట్టారు. ఈ క్రమంలో తెలిసిందేమిటంటే.. గ్రీన్ టీలో ఉండే పలు యాక్టివ్ సమ్మేళనాలు కోవిడ్ పై పోరాటం చేయగలవని నిర్దారించారు. అందువల్ల కోవిడ్ కు చికిత్స అందించేందుకు గ్రీన్ టీలోని సమ్మేళనాలు ఉపయోగపడతాయని అన్నారు.
అయితే ఈ విషయంపై ఇంకా పరిశోధనలు చేయాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు. కోవిడ్ పై పోరాడే కచ్చితమైన గ్రీన్ టీ సమ్మేళనాల గురించి ఇంకా తెలుసుకోవాల్సి ఉందని, అప్పుడే కోవిడ్‌కు మెరుగైన చికిత్సను అందించేలా ఔషధాన్ని అందుబాటులోకి తేగలమని అంటున్నారు. ఇక వారు చేపట్టిన పరిశోధనలకు చెందిన వివరాలను ఆర్ఎస్‌సీ అడ్వాన్సెస్ అనే జర్నల్‌లోనూ ప్రచురించారు.