దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్(Coivd Vaccine)ల పంపిణీ కార్యక్రమం చురుగ్గా కొనసాగుతోంది. కోవాగ్జిన్, కోవిషీల్డ్‌తోపాటు స్పుత్‌నిక్ టీకాలను ప్రజలకు అందిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి వ్యాక్సిన్ల కొరత ఉన్న కారణంగా ఎక్కువ మందికి టీకాలను ఇవ్వలేకపోతున్నారు. కానీ 2-3 నెలల్లో పెద్ద ఎత్తున టీకాలను అందుబాటులో ఉంచుతామని కేంద్రం తెలియజేసింది. దీంతో త్వరలో టీకాల పంపిణీ మరింత వేగం పుంజుకోనుంది.
అయితే కోవిడ్ టీకాలను తీసుకుంటున్న చాలా మందికి అనేక సందేహాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో, ఇంటర్నెట్‌లో చదివి, వాళ్లు, వీళ్లు చెప్పింది విని అనేక అపోహలకు గురవుతున్నారు. అనేక అనుమానాలు పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే కోవిడ్ టీకాలను సాయంత్రం కాకుండా ఉదయం తీసుకుంటేనే మంచిదని, దీంతో రోగ నిరోధక వ్యవస్థ మరింత మెరుగ్గా పనిచేస్తుందనే వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే..
మన శరీరంలో భిన్న సమయాల్లో భిన్న క్రియలు జరుగుతుంటాయి. అందులో భాగంగానే పగలు రోగ నిరోధక వ్యవస్థ కణాలు ఏర్పడి అవి శరీరంలోని అన్ని భాగాలకు చెందిన కణజాలాల వద్దకు చేరుకుంటాయి. రాత్రి పూట అవి శరీరంలో తిరుగుతూ ఇన్‌ఫెక్షన్లను పసిగడతాయి. అందుకని ఉదయం పూట రోగ నిరోధక వ్యవస్థ యాక్టివ్‌గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక 2016లో 250 మందికి ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య ఇచ్చారు. దీంతో వారిలో యాంటీ బాడీలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యాయని గుర్తించారు.
అలాగే కొందరికి బీసీజీ వ్యాక్సిన్‌ను ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య ఇచ్చారు. వారిలో రోగ నిరోధకత బాగా పెరిగినట్లు గుర్తించారు. అందువల్ల ఉదయం రోగ నిరోధక వ్యవస్థ బాగా పనిచేస్తుందని చెబుతున్నారు. కానీ ఇది కరోనా వైరస్‌కు వర్తిస్తుందా, లేదా ? అన్న విషయాన్ని పరిశోధనల ద్వారా తెలుసుకోవాల్సి ఉందన్నారు. అయితే కోవిడ్ టీకాలు ప్రస్తుతం దొరకడమే కష్టంగా ఉంది కనుక మనకు ఏ సమయంలో టీకా లభిస్తే ఆ సమయంలో వేసుకోవాల్సిందేనని, ఉదయం, సాయంత్రం అనేది చూడకూడదని నిపుణులు సలహా ఇస్తున్నారు.