కోవిడ్ నుంచి కోలుకున్నాక ఎంత కాలం వ‌ర‌కు ఇమ్యూనిటీ ల‌భిస్తుంది ?

క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్న బాధితుల్లో కేవ‌లం కొన్ని రోజుల పాటు మాత్ర‌మే యాంటీ బాడీలు ఉంటాయ‌ని, అందువ‌ల్ల వారికి మళ్లీ ఇన్‌ఫెక్ష‌న్ సోకేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని గ‌తంలో ప‌లువురు సైంటిస్టులు వెల్ల‌డించారు. అయితే తాజాగా మ‌రికొంద‌రు సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల ప్ర‌కారం.. కోవిడ్ నుంచి కోలుకున్న బాధితుల్లో కొన్ని రోజుల వ‌ర‌కు యాంటీ బాడీలు ఉన్న‌ప్ప‌టికీ.. దాదాపుగా 8 నెల‌ల వ‌ర‌కు వారికి కోవిడ్ నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంద‌ని వెల్ల‌డైంది.

ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివ‌ర్సిటీకి చెందిన ప‌రిశోధ‌కులు కోవిడ్ నుంచి కోలుకున్న 25 మంది పేషెంట్ల నుంచి 36 వ‌ర‌కు బ్ల‌డ్ శాంపిల్స్‌ను సేక‌రించారు. త‌రువాత ఆ శాంపిల్స్‌లో 4వ రోజు నుంచి 242 వ‌ర‌కు యాంటీ బాడీల‌ను, ఇత‌ర అంశాల‌ను ప‌రిశీలించారు. దీంతో వెల్ల‌డైందేమిటంటే.. కోవిడ్ నుంచి కోలుకున్న పేషెంట్ల‌లో దాదాపుగా 20 రోజుల వ‌ర‌కు యాంటీ బాడీలు ఉంటాయ‌ని అన్నారు.

అయితే 20 రోజుల త‌రువాత యాంటీ బాడీలు లేక‌పోయినా వారిలో మెమొరీ బి సెల్స్ ఉంటాయ‌ని, అవి మ‌ళ్లీ కోవిడ్ సోక‌కుండా 8 నెలల వ‌ర‌కు ర‌క్ష‌ణ అందిస్తాయ‌ని గుర్తించారు. స‌ద‌రు సెల్స్ 8 నెల‌ల వ‌ర‌కు బాధితుల శ‌రీరంలో ఉంటాయ‌న్నారు. ఈ క్ర‌మంలో బాధితులు మ‌ళ్లీ కోవిడ్ ఇన్‌ఫెక్ష‌న్ బారిన ప‌డితే స‌ద‌రు బి సెల్స్ వెంట‌నే గుర్తించి పెద్ద ఎత్తు యాంటీ బాడీల‌ను వేగంగా ఉత్ప‌త్తి చేస్తాయ‌ని, దీంతో కోవిడ్ నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంద‌ని, అందువ‌ల్ల ఒక్క‌సారి కోవిడ్ వ‌చ్చిన వారికి మ‌ళ్లీ కోవిడ్ రాకుండా ఉంటుంద‌ని తేల్చారు.

ఇక సైంటిస్టులు చేప‌ట్టిన త‌మ ప‌రిశోధ‌న‌ల తాలూకు వివ‌రాల‌ను సైన్స్ ఇమ్యునాల‌జీ అనే జ‌ర్న‌ల్‌లోనూ ప్ర‌చురించారు. అయితే ఈ విధంగా జ‌ర‌గ‌డం వ‌ల్ల వ్యాక్సిన్లు కూడా స‌రిగ్గానే ప‌నిచేస్తాయ‌ని, అవి కోవిడ్ బారి నుంచి ర‌క్ష‌ణ‌ను క‌ల్పిస్తాయ‌ని ప‌రిశోధ‌కులు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.