‘యాపిల్’పై పెరిగిన మోజు… రూ.926 కోట్ల లాభం..!

-

ఆ యాపిల్ కి రోజురోజుకు క్రేజ్ పెరిగిపోతుంది. భారత్ సహా ఇతర దేశాల్లో వాటి అమ్మకాలు ఊపందుకుంటున్నాయి. టెక్‌ దిగ్గజం, ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ యాపిల్‌ ఉత్పత్తుల అమ్మకాలు భారత్‌లో గణనీయంగా పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం యాపిల్ విక్రయాలు రూ.13,756 కోట్లకు చేరాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ.10,674 కోట్లతో పోలిస్తే ఇది 29 శాతం అధికమనే చెప్పొచ్చు.

iphone
iphone

2019-20 భారత్‌లో క్రయవిక్రయాలపై యాపిల్‌ నికర లాభం రూ.926 కోట్లకు పెరిగిందంటే ఊహించుకోవచ్చు దానికి ప్రజల్లో ఉన్న క్రేజ్ ఏంటో. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.262 కోట్లకు మాత్రమే పరితమైంది. భారత ప్రీమియం సెగ్మెంట్‌ ఫోన్ల మార్కెట్లో శాంసంగ్, వన్‌ప్లస్‌ వంటి సంస్థలు వేగంగా దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో వాటికి మరింత గట్టి పోటీనివ్వడంపై యాపిల్‌ దృష్టి పెడుతోన్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా ఫాక్స్‌కాన్, విస్ట్రాన్‌ల భాగస్వామ్యంతో యాపిల్‌ ఇటీవలే భారత్‌లో ఐఫోన్‌ 11 అసెంబ్లింగ్‌ను ప్రారంభించింది. ఈమధ్య కాలంలోనే దేశీయంగా యాపిల్ తొలి ఆన్‌లైన్‌ స్టోర్‌ను ప్రారంభించింది. కాగా దానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందని… ఈ మేరకే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ త్రైమాసికంలో భారత్‌లో మరింత మెరుగైన ఫలితాలు సాధించినట్లు యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ ఇటీవల పేర్కొన్నారు.

కరోనా సమయంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడం వల్లే భారీ ఎత్తున యాపిల్ ఫోన్ల అమ్మకాలు జరిగాయని తెలుస్తోంది. మార్కెట్ సర్వే సంస్థ కెనాలిస్ డైరెక్టర్ రుషభ్ దోషి తెలిపిన ప్రకారం మూడో త్రైమాసికం (జులై-సెప్టెంబర్)లో భారత్లో యాపిల్ సంస్థ దాదాపు 8 లక్షల ఫోన్లను అమ్మకాలు జరిపినట్టు తెలిపారు. తద్వారా రెండంకెల వృద్ధిని సాధించిందని వెల్లడించారు. ఇంక కొత్త ఐఫోన్‌ 12కి ఫ్రీ ఆర్డర్లు వెల్లువెత్తడం వల్ల కంపెనీకి లాభాలు వచ్చినట్టు పరిశ్రమవర్గాలు వెల్లడిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news