వాట్సాప్ యూజ‌ర్ల‌ను వ‌ణికిస్తున్న పెగాస‌స్ స్పై వేర్‌.. ఏమిటిది..? ఏం చేస్తుంది..?

టెక్నాలజీ ప్ర‌పంచంలో వినియోగ‌దారుల‌కు భ‌ద్ర‌త లేకుండా పోతోంది. ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో ఒక కొత్త వైర‌స్ వారిని భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా పెగ‌స‌స్ పేరిట ఓ స్పైవేర్ వాట్సాప్ వినియోగ‌దారుల‌ను వ‌ణికిస్తోంది.

టెక్నాలజీ ప్ర‌పంచంలో వినియోగ‌దారుల‌కు భ‌ద్ర‌త లేకుండా పోతోంది. ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో ఒక కొత్త వైర‌స్ వారిని భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా పెగ‌స‌స్ పేరిట ఓ స్పైవేర్ వాట్సాప్ వినియోగ‌దారుల‌ను వ‌ణికిస్తోంది. అయితే ఇంత‌కీ ఈ స్పైవేర్ ఏమిటి ? ఇది మ‌న ఫోన్ల‌కు ఎలా వ్యాపిస్తుంది ? ఆ త‌రువాత అది ఏం చేస్తుంది ? అన్న వివ‌రాల‌ను ఒక‌సారి ప‌రిశీలిస్తే…

what is pegasus spyware what it will do to your phone

పెగ‌స‌స్ అనే స్పైవేర్‌ను ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్‌వో గ్రూప్ అనే కంపెనీ డెవ‌ల‌ప్ చేసింది. ఇదొక వైర‌స్‌. ఇది ఫోన్‌లో వ్యాపిస్తే ఆ త‌రువాత ఫోన్‌లో ఉండే కాంటాక్ట్‌లు, మెసేజ్‌లు, ఈ-మెయిల్స్‌, ఫొటోలు, ఫైల్స్‌, లొకేష‌న్స్‌, పాస్‌వ‌ర్డ్‌లు త‌దిత‌ర వివ‌రాల‌ను సేక‌రించి యూజ‌ర్ల‌కు ఏమాత్రం తెలియ‌కుండా హ్యాక‌ర్ల‌కు ఆ స‌మాచారాన్ని చేర‌వేస్తుంది. దీంతో హ్యాక‌ర్లు ప్ర‌పంచంలో ఎక్క‌డ ఉన్నా యూజ‌ర్ల ఫోన్ల‌ను కంట్రోల్‌లోకి తెచ్చుకోవ‌చ్చు. దీంతో వారు యూజ‌ర్లు చేసే కాల్స్‌ను బ్లాక్ చేయ‌వ‌చ్చు. యూజ‌ర్లు ఏయే యాప్‌ల‌ను వాడుతున్నారు, ఎవ‌రెవ‌రికి కాల్స్ చేస్తున్నారు, ఎక్క‌డున్నారు.. త‌దిత‌ర అనేక వివ‌రాలను హ్యాక‌ర్లు తెలుసుకుంటారు. అంతేకాకుండా, ఫోన్‌లో ఉన్న సమస్త సమాచారం.. అంటే ఫోటోలు, విడియోలు, ఏవైనా డాక్యుమెంట్లు కూడా హ్యాకర్లకు చేరిపోతాయి.

ఇక‌ పెగ‌స‌స్ స్పైవేర్ ఫోన్ల‌కు ప‌లు వెబ్‌సైట్ లింకుల ద్వారా వ్యాప్తి చెందుతున్న‌ట్లు గుర్తించారు. యూజ‌ర్ ఫోన్‌లోని వాట్సాప్‌కు హ్యాక‌ర్లు వెబ్‌సైట్ లింకుల‌ను మెసేజ్‌ల‌లో పంపిస్తే, వాటిని యూజ‌ర్ క్లిక్ చేస్తే వెంట‌నే పెగ‌స‌స్ స్పైవేర్ వ్యాప్తి చెందుతుంద‌ని నిర్దారించారు. ఇంకా వాట్సప్‌కాల్‌లో కేవలం మిస్‌డ్‌ కాల్‌ ఇచ్చినా కూడా ఈ స్పైవేర్‌ ఫోన్‌లోకి చొరబడుతుందని తాజాగా తేల్చారు. ఇది చాలా ప్రమాదకరమైన చొరబాటు. వినియోగదారులు ఏమాత్రం నియంత్రించలేని ప్రయత్నం. ఈ క్ర‌మంలోనే భార‌త్‌లోని జ‌ర్న‌లిస్టుల‌తోపాటు ప‌లువురు యాక్టివిస్టులు, అనేక మంది వాట్సాప్ యూజ‌ర్లు ఈ స్పైవేర్ బారిన ప‌డ్డార‌ని స‌మాచారం. దీంతో రంగంలోకి దిగిన వాట్సాప్ మాతృసంస్థ ఫేస్‌బుక్ స‌ద‌రు ఎన్ఎస్‌వో గ్రూప్‌పై ఇప్ప‌టికే కొన్ని వేల కోట్ల రూపాయ‌లకు దావా వేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే వాట్సాప్ యూజ‌ర్లు మాత్రం త‌మ‌కు వ‌చ్చే మెసేజ్‌ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ప్ర‌ముఖ ఐటీ సెక్యూరిటీ సంస్థ కాస్ప‌ర్ స్కై హెచ్చ‌రిస్తోంది..!

ఎందుకైనా మంచిది, ఏమాత్రం తెలియని, అర్థంకాని మెసేజ్‌లు ఓపెన్‌ చేయకుండానే డిలీట్‌ చేయండి. అపరిచిత కాల్స్‌ పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి. ఫోన్‌లో విలువైన సమాచారం ఉందని మీరు భావిస్తే, ముఖ్యంగా ఫోన్‌ ఎవరికీ ఇవ్వకండి. ఎంత ఆత్మీయులైనా సరే. ఎందుకంటే చాలా రకాల స్పైవేర్లు ఇప్పుడు గూగుల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో చాలావరకు హ్యాక్‌ చేయాలనుకున్న ఫోన్‌ను హ్యాకర్‌ సొంతంగా ఇన్‌స్టాల్‌ చేయాల్సిఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించండి.