వీపీఎన్.. దీన్నే వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ అని కూడా అంటారు. ఇంటర్నెట్ ప్రపంచంలో సాధారణంగా మనం ఏ పనిచేసినా.. అంటే వెబ్‌సైట్లను సందర్శించినా.. ఇతర ఏవైనా పనులు చేసినా.. హ్యాకర్లు మన డేటాను తస్కరించేందుకు వీలుంటుంది. అయితే అలా కాకుండా ఉండేందుకు వీపీఎన్ పనికొస్తుంది. అంటే.. వీపీఎన్ వల్ల మన ఇంటర్నెట్ లో ఏం చేస్తున్నదీ ఇతరులకు తెలియదు. దీని వల్ల మన డేటా ఎన్‌క్రిప్ట్ అయి సురక్షితంగా ఉంటుంది. చాలా వరకు సాఫ్ట్ వేర్ కంపెనీలు తమ కార్యకలాపాలకు గాను వీపీఎన్‌లను ఉపయోగిస్తుంటాయి.
విండోస్ కంప్యూటర్లతోపాటు ఫోన్లలోనూ వీపీఎన్‌ను ఉపయోగించవచ్చు. అందుకు గాను పలు సాఫ్ట్‌వేర్లు, యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే చాలా వరకు వీపీఎన్ యాప్‌లకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ కొన్ని యాప్స్‌లో వీపీఎన్‌ను ఉచితంగా అందిస్తున్నారు. కానీ వాటి ద్వారా కనెక్ట్ అయితే ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోతుంది. ఇక ఓపెరా వంటి ఇంటర్నెట్ బ్రౌజర్లలో ఇన్ బిల్ట్ వీపీఎన్ లభిస్తుంది. దాంట్లోనూ ఉచిత వెర్షన్‌లో తక్కువ స్పీడ్ వస్తుంది. స్వల్ప మొత్తంలో రుసుము చెల్లిస్తే వీపీఎన్‌కు గాను ప్రీమియం సేవలు లభిస్తాయి. స్పీడ్ ఎక్కువగా ఉంటుంది.
విండోస్ కంప్యూటర్లను వాడేవారికి ఎక్స్‌ప్రెస్ వీపీఎన్, సర్ఫ్ షార్క్ వీపీఎన్, నోర్డ్ వీపీఎన్, ఐపీ వానిష్ వీపీఎన్ వంటి సాఫ్ట్‌వేర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఉచిత, ప్రీమియం సేవలు లభిస్తాయి. అదేవిధంగా ఫోన్లలో వీపీఎన్ వాడదలుచుకుంటే ఎక్స్‌ప్రెస్ వీపీఎన్, నోర్డ్ వీపీఎన్, టర్బో వీపీఎన్ వంటి యాప్స్ అందుబాటులో ఉన్నాయి.
వీపీఎన్ లలో ఇతర దేశాలకు చెందిన ఐపీ అడ్రస్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. వాటికి కనెక్ట్ అయితే మన అసలు లొకేషన్ హ్యాకర్లకు తెలియదు. దీంతో ఇంటర్నెట్ ప్రపంచంలో సురక్షితంగా ఉండవచ్చు.