భారత యూజ‌ర్ల డేటా చైనా స‌ర్వ‌ర్ల‌లో..! షియోమీ గుట్టు రట్టు

-

చైనాకు చెందిన మొబైల్స్ త‌యారీదారు షియోమీ చేస్తున్న కుట్ర మ‌రోసారి బ‌ట్ట‌బ‌య‌లైంది. షియోమీకి చెందిన స్మార్ట్‌ఫోన్ల‌ను వాడుతున్న యూజ‌ర్ల డేటాను ఆ కంపెనీ సేక‌రించి దాన్ని విదేశాల్లో ఉన్న ఆలీబాబా గ్రూప్ (ఇది కూడా చైనాకు చెందిన కంపెనీయే) స‌ర్వ‌ర్ల‌లో స్టోర్ చేస్తుంద‌ని వెల్ల‌డైంది. ఈ మేర‌కు సెక్యూరిటీ రీసెర్చ‌ర్లు గాబీ సిర్లిగ్‌, ఆండ్రూ టియ‌ర్నీలు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌లో తేలింది.

xiaomi sending user data from india to china servers report

షియోమీకి చెందిన రెడ్‌మీ నోట్ 8, ఎంఐ 10, రెడ్‌మీ కె20, ఎంఐ మిక్స్ 3 త‌దిత‌ర ఫోన్ల‌లో ఉండే ఎంఐ బ్రౌజ‌ర్‌తోపాటు ప‌లు ఇత‌ర షియోమీ యాప్స్ యూజర్ల డేటాను వారి అనుమ‌తి లేకుండా సేక‌రించి దాన్ని సింగ‌పూర్‌, ర‌ష్యాల‌లో ఉన్న బీజింగ్‌కు చెందిన ఆలీబాబా గ్రూప్ రిమోట్ స‌ర్వ‌ర్ల‌లో స్టోర్ చేస్తున్న‌ట్లు స‌ద‌రు రీసెర్చ‌ర్లు తెలిపారు. ఈ మేరకు వారు స్వ‌యంగా ఆ విష‌యాల‌ను ప‌రిశీలించారు కూడా. ఈ క్ర‌మంలోనే షియోమీ ఆ డేటాను త‌న స్వ‌ప్ర‌యోజ‌నాల‌కు వాడుకుంటుంద‌ని వారు ఆరోపించారు. ఇక ఎంఐ బ్రౌజ‌ర్‌లో ఇన్‌క‌గ్నిటో మోడ్‌ను ఆన్ చేసిన‌ప్ప‌టికీ యూజ‌ర్ సంద‌ర్శించే సైట్ల వివ‌రాల‌ను ఆ యాప్ సేక‌రిస్తుంద‌ని వారు చెబుతున్నారు.

షియోమీ త‌న ఫోన్ల‌లో ఉండే త‌న కంపెనీ యాప్స్ స‌హాయంతో యూజ‌ర్లు ఏయే నోటిఫికేష‌న్లు చూశారు, స్టేట‌స్ బార్‌ను ఎప్పుడు సంద‌ర్శించారు, ఏయే స్క్రీన్ల‌ను స్వైప్ చేశారు, ఫోన్‌లోని ఏయే ఫోల్డ‌ర్లను ఓపెన్ చేస్తున్నారు.. అనే స‌మాచారాన్ని సేక‌రిస్తున్న‌ద‌ని ఆ రీసెర్చ‌ర్లు చెబుతున్నారు. అయితే దీనిపై స్పందించిన షియోమీ.. తాము ఆ స‌మాచారం సేక‌రించే మాట వాస్త‌వ‌మే అయినా.. యూజ‌ర్ అనుమ‌తితోనే దాన్ని తీసుకుంటున్నామ‌ని.. ఆ డేటాను విశ్లేషించి వారికి భ‌విష్య‌త్తులో తాము విడుద‌ల చేయ‌బోయే ఫోన్ల‌లో ఇంకా ఎలాంటి ఫీచ‌ర్ల‌ను అందివ్వాలి.. అనే అంశాల‌ను ప‌రిశీలిస్తున్నామ‌ని, అంతేకానీ.. ఆ డేటాను ఇత‌రులెవ‌రికీ ఇవ్వ‌డం లేద‌ని.. షియోమీ స్ప‌ష్టం చేసింది.

అయితే షియోమీపై ఇలా.. డేటా త‌స్క‌ర‌ణ ఆరోప‌ణ‌లు రావ‌డం నిజానికి ఇదే మొద‌టిసారి కాదు.. 2014లోనూ షియోమీ ఇలా త‌న ఫోన్ల‌ను వాడుతున్న యూజ‌ర్ల డేటాను సేక‌రించి ఆ డేటానంతా చైనాలోని త‌మ స‌ర్వ‌ర్ల‌లో స్టోర్ చేస్తున్న‌ద‌ని అప్ప‌ట్లో దుమారం చెలరేగింది. అయితే అప్పుడు దీనిపై ఎవ‌రూ పెద్ద‌గా స్పందించ‌లేదు. ఇక ఇప్పుడు కూడా స‌రిగ్గా అదే విషయంపై మ‌రోమారు వివాదం చెల‌రేగుతోంది. మ‌రి ఈ సారి ప్ర‌భుత్వాలు ఏం చేస్తాయో చూడాలి. అయితే ఈ విష‌యం తెలిసిన‌ప్ప‌టికీ.. ఆ కంపెనీకి చెందిన ఫోన్ల‌నే ఇంకా ఎక్కువ మంది కొనుగోలు చేస్తుండ‌డం విశేషం. అందుక‌నే షియోమీ మ‌న దేశంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 30 శాతం వాటాతో అగ్ర‌స్థానంలో ఉండ‌గా, ప్ర‌పంచ మార్కెట్‌లో టాప్ 5 లిస్టులో కొన‌సాగుతోంది..!

Read more RELATED
Recommended to you

Latest news