24కె, 22కె, 18కె బంగారం మ‌ధ్య తేడాలేమిటి ? ఏది మంచిది ?

-

బంగారం అంటే భార‌తీయుల‌కు పండ‌గే. ముఖ్యంగా మ‌హిళ‌లు బంగారు ఆభ‌ర‌ణాల‌ను కొని ధ‌రించేందుకు ఆస‌క్తిని చూపిస్తుంటారు. అయితే బంగారం గురించిన వార్త‌లు వ‌చ్చిన‌ప్పుడు స‌హ‌జంగానే మ‌నం 24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 18 క్యారెట్లు అనే పేర్ల‌ను వింటుంటాం. అంత‌కీ క్యారెట్ అంటే ఏమిటి ? ఆ మూడు బంగారాల మ‌ధ్య తేడాలు ఏమిటి ? వాటిలో ఏది మంచిది ? అనే వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

24k, 22k, 18k gold differences and which one is better

క్యారెట్ (Karat) అంటే బంగారం నాణ్య‌త‌కు సూచిక‌. దాన్ని 0 నుంచి 24 స్కేలు మీద కొలుస్తారు. అంటే 24/24 ఉంటే అది స్వ‌చ్ఛ‌మైన బంగారం అని అర్థం. అదే 22/24, 18/24 అంటే స్వ‌చ్ఛ‌మైన బంగారం కాద‌ని, అందులో ఇత‌ర లోహాలు క‌లుస్తాయ‌ని అర్థం. 24 క్యారెట్ల స్వ‌చ్ఛ‌మైన బంగారంలోనూ 100 శాతం బంగారం ఉండ‌దు. 99.99 శాతం బంగారం ఉంటుంది. మిగిలింది వేరే ఏదైనా లోహం ఉంటుంది. ఎందుకంటే.. 100 శాతం స్వ‌చ్ఛ‌మైన బంగారం అయితే పెళుసుగా ఉంటుంది. త్వ‌ర‌గా విరుగుతుంది. దాన్ని నిరోధించ‌డానికే అందులో కొంత వేరే లోహాన్ని క‌లుపుతారు.

ఇక 22 క్యారెట్ల బంగారం అంటే.. అందులో బంగారం 91.67 శాతం ఉంటుంది. అందువ‌ల్లే ఈ బంగారాన్ని 916 గోల్డ్ అని అంటారు. ఇందులో ఆ శాతం బంగారం పోను మిగిలిన మొత్తంలో ఇత‌ర లోహాలు ఉంటాయి. అలాగే 18 క్యారెట్ల బంగారంలో బంగారం 75 శాతం ఉంటుంది. దీన్నే 750 ప్యూరిటీ గోల్డ్ అంటారు. ఇందులో 75 శాతం బంగారం పోను మిగిలిన మొత్తంలో లోహాలు ఉంటాయి. స‌హ‌జంగా బంగారంతోపాటు జింక్, కాప‌ర్‌, నికెల్ వంటి లోహాల‌ను క‌లుపుతారు.

అయితే పైన తెలిపిన మూడు బంగారాల్లో 24 క్యారెట్ల బంగారం స్వ‌చ్ఛ‌మైంది, నాణ్య‌మైంది.. అయిన‌ప్ప‌టికీ చాలా వ‌ర‌కు ఆభ‌ర‌ణాల్లో 22 క్యారెట్ల బంగారాన్నే ఉప‌యోగిస్తారు. కొంద‌రు 18 క్యారెట్ల బంగారాన్ని కూడా ఉప‌యోగిస్తారు. అందువ‌ల్ల ఆభ‌ర‌ణాల‌ను కొనేట‌ప్పుడు మ‌నం కొనే ఆభ‌ర‌ణాల్లో బంగారం ఎంత మేర ఉంటుందో తెలుసుకోవాలి. 18 క్యారెట్ల బంగారం ఉండే ఆభ‌ర‌ణాలు త‌క్కువ రేటు ఉంటాయి. క‌నుక కొంద‌రు మ‌న‌ల్ని మోసం చేసేందుకు అవ‌కాశం ఉంటుంది. అందువ‌ల్ల మీరు కొంటున్న బంగారం ఆ మూడు క్యారెట్ల‌లో ఏదో తెలుసుకుని మ‌రీ కొనుగోలు చేయాలి. దీంతో మోస‌పోకుండా ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news