ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) మన దేశంలో ఉన్న 650 పోస్టాఫీస్ బ్రాంచ్‌లలో 3 రకాల జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్లను ప్రజలకు అందిస్తోంది. అవి రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్, డిజిటల్ సేవింగ్స్ అకౌంట్, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్లు. కాగా ఈ మూడింటిలో కస్టమర్లు మినిమం బ్యాలెన్స్‌ను మెయింటెయిన్ చేయాల్సిన పనిలేదు. కానీ ఈ మూడింటికి అందిస్తున్న సౌకర్యాల వివరాలు భిన్నంగా ఉన్నాయి. ఇక ఈ మూడు అకౌంట్లలోనూ డబ్బు డిపాజిట్ చేస్తే 4 శాతం వడ్డీని చెల్లిస్తారు. ఈ క్రమంలోనే ఈ మూడు సేవింగ్స్ అకౌంట్లలో అందిస్తున్న సదుపాయాల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్
ఈ అకౌంట్‌ను ఓపెన్ చేయాలంటే కచ్చితంగా మీకు సమీపంలో ఉన్న పోస్టాఫీస్‌కు వెళ్లాలి. అక్కడ పేమెంట్స్ బ్యాంక్ సదుపాయం ఉంటే అందులో ఈ అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు. లేదా ఆన్‌లైన్‌లో అప్లై చేస్తే ప్రతినిధులు మీ ఇంటికే వచ్చి అకౌంట్ ఓపెన్ చేయిస్తారు. ఇక ఎలాంటి సొమ్ము లేకుండా జీరో బ్యాలెన్స్‌తో ఈ అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు. అలాగే ఈ అకౌంట్‌లో మినిమం బ్యాలెన్స్‌ను మెయింటెయిన్ చేయాల్సిన పనిలేదు. ఇక ఈ అకౌంట్ ద్వారా ఉచిత క్వార్టర్లీ అకౌంట్ స్టేట్‌మెంట్, ఐఎంపీఎస్ సర్వీస్, ఫండ్ రీమిట్టెన్స్ సదుపాయాలను అందిస్తున్నారు.
2. డిజిటల్ సేవింగ్స్ అకౌంట్
ఇండియా పోస్టుకు చెందిన పేమెంట్స్ బ్యాంక్ మొబైల్ యాప్ ద్వారానే ఈ ఖాతాను తెరవగలరు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. కస్టమర్ తన ఆధార్, పాన్ వివరాలను సమర్పించి ఇన్‌స్టంట్ గా ఈ ఖాతా ఇంటి నుంచే తెరవవచ్చు. ఇక ఈ అకౌంట్‌లోనూ మినిమం బ్యాలెన్స్‌ను మెయింటెయిన్ చేయాల్సిన పనిలేదు. జీరో బ్యాలెన్స్‌తో ఈ ఖాతా ఓపెన్ చేయవచ్చు. ఉచిత క్వార్టర్లీ అకౌంట్ స్టేట్‌మెంట్, ఐఎంపీఎస్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ వంటి సదుపాయాలు ఈ అకౌంట్‌లో లభిస్తున్నాయి.
3. బేసిక్ సేవింగ్స్ అకౌంట్
రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్‌లో లభిస్తున్న ఫీచర్లన్నీ దాదాపుగా ఈ అకౌంట్‌లోనూ వినియోగదారులకు లభిస్తున్నాయి. కాకపోతే ఈ ఖాతా ద్వారా నెలకు 4 సార్లు మాత్రమే క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ ఖాతాను కూడా జీరో బ్యాలెన్స్‌తో ఓపెన్ చేయవచ్చు. అలాగే ఇందులోనూ మినిమం బ్యాలెన్స్ ఉంచాల్సిన పనిలేదు. ఈ ఖాతాలో కస్టమర్లకు ఉచిత క్వార్టర్లీ స్టేట్‌మెంట్, ఐఎంపీఎస్ సదుపాయాలు లభిస్తున్నాయి.