పాన్‌, ఆధార్ కార్డుల అనుసంధానానికి గ‌డువు పెంపు.. కొత్త తేదీ ఎప్ప‌టి వ‌ర‌కంటే..?

దేశంలోని పాన్ కార్డు హోల్డ‌ర్ల‌కు కేంద్రం శుభ‌వార్త చెప్పింది. పాన్‌, ఆధార్ కార్డుల అనుసంధానానికి గ‌డువును పొడిగిస్తున్న‌ట్లు తెలిపింది. గ‌తంలో జూన్ 30వ తేదీ వ‌ర‌కు వీటి అనుసంధానానికి గ‌డువు విధించారు. ఆ తేదీ దాటితే రూ.10వేల జ‌రిమానా ఉంటుంద‌ని చెప్పారు. అయితే ఆ గ‌డువును కేంద్రం 2021 మార్చి 31వ తేదీ వ‌ర‌కు పొడిగించింది. దీంతో ఎంతో మంది పాన్ కార్డు దారులు ఊర‌ట చెందుతున్నారు.

కాగా కేంద్రం బ్యాంక్ అకౌంట్ల ఓపెనింగ్‌కు, ఐటీ రిట‌ర్న్స్‌ను దాఖ‌లు చేయ‌డానికి, రూ.50వేలు పైబ‌డిన ఆర్థిక లావాదేవీల‌కు పాన్‌ను త‌ప్ప‌నిస‌రి చేసిన విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే గ‌తంలో పాన్‌, ఆధార్ కార్డుల అనుసంధానానికి గ‌డువును పెంచుతూ వ‌చ్చారు. ఇక ఇప్పుడు ఈ గ‌డువును సుదీర్ఘంగా పొడిగించారు. క‌రోనా నేప‌థ్యంలోనే గ‌డువును పెంచిన‌ట్లు కేంద్రం తెలిపింది.

ఇక కొత్త‌గా పాన్ కార్డుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు త‌మ ఆధార్ కార్డు వివ‌రాల‌ను స‌మ‌ర్పిస్తే చాలు.. పాన్‌, ఆధార్‌లు రెండూ ఆటోమేటిగ్గా లింక్ అవుతాయి. కానీ ఇప్ప‌టికే పాన్ క‌లిగి ఉన్న‌వారు మాత్రం ఇన్‌కమ్‌ట్యాక్స్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రెండు కార్డుల‌ను లింక్ చేయాల్సి ఉంటుంది. ఇక పేరు పరంగా రెండు కార్డులు మ్యాచ్ కాక‌పోతే ఏదైనా ఒక కార్డులో ఉండే పేరు క‌రెక్ట్‌గా ఉందో, లేదో చెబితే చాలు, రెండు కార్డులు లింక్ అవుతాయి.