తెలంగాణలో కామన్‌ మొబిలిటీ కార్డు.. ఇకపై అన్ని అవసరాలకు ఒకటే కార్డు..!

-

తెలంగాణ గవర్నమెంట్‌ కామన్‌ మొబిలిటీ కార్డును త్వరలో తీసుకురానుంది. అసలేంటి ఈ కార్డు, ఎవరికి ఇస్తారు, ఈ కార్డు వల్ల ఏంటి ఉపయోగాలు ఈ వివరాలన్నీ తెలుసుకుందామా.!

Common Mobility in Telangana
Common Mobility in Telangana

ఈ కార్డుతో ప్రజా రవాణా వ్యవస్థలో ఉన్న వివిధ సౌకర్యాలను వినియోగించుకునే వీలుంటుంది. మొదట హైదరాబాద్ నగరంలో ఈ కార్డును జారీ చేయనుంది ప్రభుత్వం. హైదరాబాద్ నగరంలోని ప్రజా రవాణా వ్యవస్థ మొత్తానికి కలిపి ఉపయుక్తంగా ఉండేలా ఒక కామన్ మెబిలిటీ కార్డుని తీసుకువచ్చే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటికే హైదరాబాద్ మెట్రోలో తెలంగాణ ఆర్టీసీ సంస్ధలు కార్యచరణ ప్రారంభించాయి.

ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ప్రధానమైన ప్రజా రవాణా మార్గాలుగా ఉన్న మెట్రో రైల్, ఆర్టీసీ బస్సులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాడుకునేందుకు వీలుండేలా ఈ కార్డు ఉండనున్నది. మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో ఆర్టీసీ, మెట్రో రైల్ సంస్థల ఉన్నతాధికారులు ఈ కార్డుకు సంబంధించిన పలు వివరాలను వెల్లడించారు. ఈ కార్డు జారీ ప్రక్రియ నుంచి మొదలుకొని వివిధ ప్రాంతాల్లో దాని ఉపయోగం వరకు నగర ప్రజలకు అందుబాటులో ఉండే సేవలు వివరాలను అధికారులు మంత్రులకు తెలియజేశారు.

మొదట మెట్రో రైల్, ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి వీలుగా ఈ కార్డుని జారీ చేస్తామని, ఇదే కార్డుతో సమీప భవిష్యత్తులో ఎంఎంటీఎస్, క్యాబ్ సేవలు, ఆటోలను కూడా వినియోగించుకునే తీరుగా విస్తరిస్తామని మంత్రులు తెలిపారు. ఇదే కార్డుతో భవిష్యత్తులో పౌరులు తమ ఇతర కార్డుల మాదిరే కొనుగోళ్లకు కూడా వినియోగించేలా వన్ కార్డ్ ఫర్ అల్ నీడ్స్ మాదిరి ఉండాలని మంత్రులు అధికారులకు సూచించారు.

అన్ని అవసరాలకు తగ్గట్టుగా..

ప్రస్తుతం ప్రయోగాత్మకంగా హైదరాబాద్ నగరం వరకు ఈ కార్డు జారీ ఉంటుందని, త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా ఈ కార్డు సేవలు అందించేలా విస్తరించడం లక్ష్యంగా పెట్టుకోవాలని అధికారులకు మంత్రులు అదేశించారు. ఈ కార్డు కలిగిన పౌరులు దేశవ్యాప్తంగా నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు వినియోగించేందుకు అవకాశం ఉన్న ప్రతి చోట వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుందని మంత్రులు తెలిపారు.

దీంతో ప్రభుత్వం జారీ చేస్తున్న ఈ కార్డు వలన ఇతర మెట్రో నగరాలకు వెళ్ళినప్పుడు అక్కడి ఆర్టీసీ బస్సులు లేదా మెట్రో రైల్ ఇతర ప్రజా రవాణా వ్యవస్థను ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాడుకునేందుకు వీలు కలుగుతుందని తెలిపారు. ఈ కార్డును ప్రయోగాత్మకంగా ఆగస్టు రెండవ వారంలోగా నగర పౌరులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలని మంత్రులు ఆదేశాలు జారీ చేశారు.

ఇందుకు సంబంధించి మెట్రో రైల్, ఆర్టీసీ సంస్థ అధికారులు సమన్వయంతో వేగంగా ముందుకు పోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేయనున్న ఈ కామన్ మొబిలిటీ కార్డుకి ఒక పేరును సూచించాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ పౌరుల నుంచి పేర్లను సూచించాలని కోరుతూ ట్వీట్ కూడా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news