భూగర్భ జలాలను మనం కాపాడుకుంటే ముందు ముందు నీటి కష్టాలు రాకుండా ఉంటాయి. అందుకు గాను మనం ఇంకుడు గుంతలను నిర్మించాలి. వాటితో వాన నీటిసి ఒడిసిపడితే భూగర్భ జలాలు వాటంతట అవే పెరుగుతాయి.
రాను రాను భూగర్భ జలాలు ఎలా అంతరించిపోతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. దాని వల్ల దేశంలోని అనేక ప్రాంతాల్లో వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంటోంది. ప్రస్తుతం చెన్నై నగరం కూడా ఇలాంటి స్థితినే అనుభవిస్తోంది. అందుకు కారణం.. భూగర్భ జలాలు అడుగంటి పోవడమే. అయితే భూగర్భ జలాలను మనం కాపాడుకుంటే ముందు ముందు ఇలాంటి దయనీయ పరిస్థితి రాకుండా ఉంటుంది. అందుకు గాను మనం ఇంకుడు గుంతలను నిర్మించాలి. వాటితో వాన నీటిసి ఒడిసిపడితే భూగర్భ జలాలు వాటంతట అవే పెరుగుతాయి. మరి ఇంకుడు గుంతలను ఎలా నిర్మించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఇంకుడు గుంతలను నిర్మించుకునే విధానం:
* ఇంకుడు గుంతలను ఎప్పుడూ బోరు బావికి దగ్గర్లోనే నిర్మించాలి. దీని వల్ల గుంతల్లో పడిన వాన నీరు బోరు బావిలోకి చేరుతుంది. దీంతో భూగర్భ జలం పెరుగుతుంది.
* ఇంకుడు గుంత కోసం 2 మీటర్ల పొడవు, 1 మీటరు వెడల్పు, 1 మీటరు లోతు ఉన్న గుంతను తవ్వుకోవాలి. ఇండ్లలో ఏర్పాటు చేసుకునే చిన్నపాటి ఇంకుడు గుంతలకు ఈ కొలత వర్తిస్తుంది. అదే బయట స్థలం ఎక్కువగా ఉంటే విస్తీర్ణాన్ని బట్టి ఇంకా పెద్ద సైజ్‌తో ఇంకుడు గుంతలను నిర్మించుకోవచ్చు.
* ఆ గుంతను నాలుగు భాగాలు చేయాలి. కింది భాగాన్ని గులకరాళ్లతో నింపాలి. దానిపై భాగంలో కంకర రాళ్లను నింపాలి. దాని మీద మరొక భాగంలో ఇసుక నింపాలి. దీంతో గుంత 3/4 భాగం పూర్తవుతుంది. ఇక మిగిలిన 1/4 భాగాన్ని ఖాళీగా వదిలేయాలి. అందులోకి నీరు వచ్చి పడుతుంది. దీంతో ఆ నీరు సులభంగా కిందకు చేరుతుంది.
* చుట్టు పక్కల పడిన వర్షపు నీరు మొత్తం ఆ ఇంకుడు గుంతలోకి వెళ్లేలా కాలువలు, పైపులు ఏర్పాటు చేయాలి.
* నేల స్వభావం, పరిసరాలు, నీటి లభ్యతను బట్టి ఇంకుడు గుంత పరిమాణాన్ని పెంచుకోవచ్చు.
* స్థలం ఎక్కువగా ఉంటే పెద్ద ఇంకుడు గుంతను నిర్మించుకోవచ్చు. పొలాలు, ఇంటి ముందు బాగా స్థలం ఉంటే పెద్ద ఇంకుడు గుంతను నిర్మించి మరింత వాన నీటిని ఒడిసిపట్టవచ్చు.