ప్రధాని మోదీ దేశంలోని బడుగు, బలహీన, పేద వర్గాలకు చెందిన ప్రజల కోసం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చిన విషయం విదితమే. ఈ పథకం ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అమలులో ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం తాజాగా దీన్ని అమలులోకి తెచ్చింది. దీనికి ఎంతో మందికి లబ్ధి కలగనుంది. ఈ పథకం కింద లబ్ధిదారులకు ఉచితంగా ఖరీదైన వైద్యాన్ని అందిస్తారు.
ఆయష్మాన్ భారత్ పథకానికి దరఖాస్తు చేసుకునేది ఏమీ ఉండదు. లబ్ధిదారులను కేంద్రమే ఆటోమేటిగ్గా ఈ పథకంలోకి చేరుస్తుంది. అయితే ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలో ఉన్న బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారి జాబితాను కేంద్రానికి పంపుతాయి. ఆ జాబితాను సోషియో ఎకనామిక్ అండ్ క్యాస్ట్ సెన్సస్ (ఎస్ఈసీసీ) అని పిలుస్తారు. అందులో ఉన్న వారు ఆయుష్మాన్ భారత్ పథకానికి అర్హులు. ఇక ఈ పథకం కింద లబ్ధిదారులు తమ పేర్లను ఆన్‌లైన్‌లో సులభంగా చెక్ చేసుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే..
* https://mera.pmjay.gov.in/search/login అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
* అందులో మొబైల్ నంబర్, కాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ బటన్‌పై క్లిక్ చేయాలి.
* ఓటీపీని కన్‌ఫాం చేశాక మరో పేజీ ఓపెన్ అవుతుంది.
* అందులో పేరు లేదా హౌజ్ హోల్డ్ నంబర్ (హెచ్‌హెచ్‌డీ) లను ఎంటర్ చేసి ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారుల జాబితాలో పేరు ఉందా, లేదా అన్న వివరాలను చెక్ చేసుకోవచ్చు.
* పేరుతో సెర్చ్ చేసేట్లయితే అందులో తల్లిదండ్రుల పేర్లు, ప్రాంతం పేరు, రాష్ట్రం, ఉంటున్న జిల్లా, వార్డు తదితర వివరాలను నమోదు చేయాలి. దీంతో జాబితాలో పేరు ఉంటే కుడి వైపున కనిపిస్తాయి.
* కుడి వైపు వచ్చే జాబితాలో పేర్లు ఉంటే వాటికి ఎదురుగా ఫ్యామిలీ డిటెయిల్స్ అనే సెక్షన్ కనిపిస్తుంది.
* అందులో లబ్ధిదారులు ఈ స్కీంకు చెందిన తమ వివరాలను తెలుసుకోవచ్చు.
అయితే ఆన్‌లైన్ సౌకర్యం లేకున్నా ఆయుష్మాన్ భారత్ స్కీం అందుబాటులో ఉన్న హాస్పిటల్‌లో సహాయక కేంద్రాన్ని సంప్రదిస్తే వారు లబ్ధిదారుల వివరాలతో జాబితాను సెర్చ్ చేసి వివరాలను తీసుకుంటారు. వివరాలు వస్తే ఉచితంగా చికిత్స పొందవచ్చు.
ఇక ఈ పథకం కింద లబ్ధిదారులకు కింద తెలిపిన ప్రయోజనాలు కలుగుతాయి.
* ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఒక్కో లబ్ధిదారుడికి ఏడాదికి రూ.5 లక్షల ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ లభిస్తుంది. దీంతో ఈ స్కీం అందుబాటులో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్‌లోనూ నయా పైసా చెల్లించకుండా ఉచితంగా వైద్యం పొందవచ్చు. అందుకుగాను ముందుగా వివరాలను సహాయక కేంద్రంలో ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ లభిస్తుంది.
* దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 10 కోట్లకు పైగా పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు ఈ పథకం కింద ప్రయోజనం లభిస్తుంది. చిన్న చిన్న పనులు చేసుకునేవారు ఏడాదికి కనీస ఆదాయం కూడా లేని వారు ఈ స్కీం కింద లబ్ధి పొందవచ్చు.
* ఈ పథకం కింద ఆడ పిల్లలు, మహిళలు, చిన్నారులు, వృద్ధులకు ముందుగా ప్రాధాన్యతను ఇస్తారు.
* దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా ఈ స్కీం వర్తిస్తుంది. స్కీంలో అర్హత పొందిన లబ్ధిదారులకు మొదటి రోజు నుంచే అన్ని ప్రయోజనాలు వర్తిస్తాయి.
* కార్డియాలజీ, యూరాలజీ వంటి స్పెషలిస్టు డాక్టర్లచే కూడా ఈ స్కీం కింద ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చు. కరోనా, క్యాన్సర్, గుండె జబ్బులకు ఉచితంగా చికిత్స అందిస్తారు.