Credit Card : క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్‌.. తెలుసుకోవాల్సిన ముఖ్య‌మైన అంశాలివి..!

-

క్రెడిట్ కార్డుల‌ను వాడేవారు చాలా మంది నెల నెలా త‌మ‌కు వచ్చే క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్‌ను చాలా సుల‌భంగానే అర్థం చేసుకుంటారు. ఒకటి క‌న్నా ఎక్కువ కార్డుల‌ను వాడేవారిలో చాలా మందికి త‌మ క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్ల‌ను అర్థం చేసుకోవ‌డం సుల‌భంగానే ఉంటుంది. కానీ కొత్త‌గా క్రెడిట్ కార్డుల‌ను తీసుకునే వారికి ఆ కార్డుల‌కు చెందిన స్టేట్‌మెంట్ల‌ను అర్థం చేసుకోవ‌డం కొంచెం క‌ష్టంగానే ఉంటుంది. అలాంటి వారు కింద ఇచ్చిన అంశాల గురించి వివ‌రంగా తెలుసుకుంటే.. దాంతో క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్ ను చాలా సుల‌భంగా అర్థం చేసుకోవ‌చ్చు. మరి కొత్త‌గా క్రెడిట్ కార్డు తీసుకున్నవారికి నెల నెలా వ‌చ్చే స్టేట్‌మెంట్‌లో ఉండే అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా..!

1. కార్డు లిమిట్‌…

క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్‌లో కార్డు లిమిట్‌కు సంబందించి మూడు అంశాలు ఉంటాయి. అవి టోట‌ల్ క్రెడిట్ లిమిట్‌, క్యాష్ లిమిట్‌, అవైల‌బుల్ క్రెడిట్ లిమిట్‌. టోట‌ల్ క్రెడిట్ లిమిట్ అంటే.. మీ కార్డుకు ఇచ్చిన మొత్తం లిమిట్ అన్న‌మాట‌. అంటే ఆ లిమిట్ వ‌ర‌కు మీరు కార్డును వాడుకోవ‌చ్చు. ఇక క్యాష్ లిమిట్ అంటే.. మీరు తీసుకున్న కార్డును బ‌ట్టి ఫైనాన్స్ సంస్థ‌లు, బ్యాంకులు కార్డుకు క్యాష్ లిమిట్ ఇస్తాయి. అంటే.. ఆ మొత్తం వ‌ర‌కు మీరు ఏటీఎం నుంచి తీసుకోవ‌చ్చ‌న్న‌మాట‌. ఉదాహ‌ర‌ణ‌కు టోట‌ల్ క్రెడిట్ లిమిట్ రూ.80వేలు ఇచ్చార‌నుకుందాం. అందులో క్యాష్ లిమిట్ రూ.20వేలు అనుకుంటే.. రూ.20వేల‌కు మీరు ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకోవ‌చ్చ‌న్న‌మాట‌. అంత‌కు మించి న‌గ‌దు తీసుకునే అవ‌కాశం ఉండ‌దు. ఇక అవైల‌బుల్ క్రెడిట్ లిమిట్ అంటే.. మీరు మీ కార్డులో ఉన్న టోట‌ల్ క్రెడిట్ లిమిట్‌లో వాడుకున్న మొత్తం పోగా, మిగిలిన బ్యాలెన్స్ అన్న‌మాట‌. అంటే.. రూ.80వేల లిమిట్ ఉన్న కార్డులో మీరు రూ.40వేలు వాడితే.. ఆ మొత్తం పోను ఇంకా మీ కార్డులో రూ.40వేల అవైల‌బుల్ క్రెడిట్ లిమిట్ ఉంటుంది.

2. టోట‌ల్ డ్యూ అమౌంట్‌…

నెల రోజుల్లో మీరు మీ క్రెడిట్ కార్డు ద్వారా చేసిన లావాదేవీల మొత్తాన్ని టోట‌ల్ డ్యూ అమౌంట్ అంటారు. అంటే.. రూ.80వేల లిమిట్ ఉన్న కార్డులో మీరు రూ.40వేల వ‌ర‌కు వాడితే.. అదే టోట‌ల్ డ్యూ అమౌంట్ అవుతుంది.

3. డ్యూ డేట్‌…

మీ క్రెడిట్ కార్డుకు వ‌చ్చిన బిల్లును క‌ట్టేందుకు ఆఖ‌రి తేదీనే డ్యూ డేట్ అంటారు. ఈ తేదీలోగా మీ కార్డుకు చెందిన టోట‌ల్ డ్యూ అమౌంట్‌ను చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే లేట్ ఫీజుతోపాటు స‌ద‌రు మొత్తాన్నికి వ‌డ్డీ చెల్లించాల్సి ఉంటుంది. సాధార‌ణంగా క్రెడిట్ కార్డుల బిల్లుల‌ను పెండింగ్ పెడితే ఆ మొత్తాల‌పై 22 నుంచి 44 శాతం వ‌ర‌కు వ‌డ్డీని వ‌సూలు చేస్తారు. అందుకే వడ్డీ, ఆల‌స్య రుసుము చెల్లించాల్సిన అవ‌స‌రం రాకుండా ఉండేందుకు క్రెడిట్ కార్డు బిల్లును డ్యూ డేట్‌లోగా చెల్లించాలి. సాధార‌ణంగా క్రెడిట్ కార్డుల ద్వారా చేసిన లావాదేవీల మొత్తానికి కేవ‌లం 45 రోజుల వ‌ర‌కే వ‌డ్డీ ఉండ‌దు. ఆ స‌మ‌యం దాటితే వ‌డ్డీ వేస్తారు.

4. మినిమం అమౌంట్ డ్యూ…

మీ క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్‌లో టోట‌ల్ అమౌంట్ డ్యూతోపాటు మినిమం అమౌంట్ డ్యూ అని కూడా ఉంటుంది. టోటల్ అమౌంట్ అంటే బిల్లు మొత్తం. మ‌రి మినిమం అమౌంట్ అంటే.. ఏమిట‌ని చాలా మంది క‌న్‌ఫ్యూజ్ అవుతుంటారు. మినిమం అమౌంట్ అంటే.. మీ కార్డు బిల్లును మొత్తం చెల్లించ‌లేని ప‌రిస్థితి ఉంటే.. మీరు మినిమం అమౌంట్ చెల్లించ‌వ‌చ్చు. దీంతో ఆల‌స్య రుసుము త‌ప్పుతుంది. కానీ వడ్డీ వేస్తారు. అంటే.. ఉదాహ‌ర‌ణ‌కు మీ క్రెడిట్ కార్డు బిల్లు రూ.40వేలు వ‌చ్చింద‌నుకుంటే.. దానికి మినిమం డ్యూ రూ.3వేలు అనుకుంటే.. మీ ద‌గ్గ‌ర రూ.40వేలు లేని ప‌క్షంలో మీరు రూ.3వేలు, ఆపైన ఎంత మొత్త‌మైనా చెల్లించ‌వ‌చ్చ‌న్న‌మాట‌. అంటే మీరు రూ.4వేలు చెల్లించార‌నుకుందాం. అప్పుడు బ్యాలెన్స్ రూ.36 వేలు ఉంటుంది. దానికి తదుప‌రి నెల‌లో వ‌డ్డీ వేస్తారు. కానీ ఆల‌స్య రుసుం మాత్రం ఉండ‌దు. సాధార‌ణంగా క్రెడిట్ కార్డుల‌ను ఇచ్చే బ్యాంకులు ఏవైనా ఆల‌స్య రుసుంను రూ.100 నుంచి రూ.1వేయి వ‌ర‌కు వ‌సూలు చేస్తాయి. ఇది మీరు క‌ట్టాల్సిన టోట‌ల్ డ్యూ అమౌంట్‌ను బ‌ట్టి మారుతుంది.



5. అకౌంట్ స‌మ్మ‌రీ…

మీ క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్‌లో ఉండే అకౌంట్ స‌మ్మ‌రీలో… మీరు చివ‌రి సారిగా మీ కార్డుకు చెల్లించిన బిల్లు మొత్తం, బిల్లింగ్ స‌మ‌యంలో ఎంత ఖ‌ర్చు పెట్టారు, పాత బ‌కాయిలు, వాటికి సంబంధించిన చార్జీలు త‌దిత‌ర స‌మాచారం ఉంటుంది.

6. ట్రాన్సాక్ష‌న్ డిస్క్రిప్ష‌న్…

బిల్లింగ్ కాల వ్య‌వ‌ధిలో మీరు కార్డుపై చేసిన అన్ని లావాదేవీల స‌మాచారం ఈ విభాగంలో ఉంటుంది. ఏ తేదీన‌, ఏ ప్రాంతంలో, ఎక్క‌డ‌, ఎంత మొత్తం కార్డు ద్వారా వాడారో స్ప‌ష్టంగా ఇందులో వివ‌రాలను పొందుపరుస్తారు. వాటిని చూసి ట్రాన్సాక్ష‌న్ వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు.

7. రివార్డు పాయింట్లు…

మీరు మీ క్రెడిట్ కార్డు ద్వారా వాడిన మొత్తానికి గాను రివార్డు పాయింట్ల‌ను ఇస్తారు. సాధార‌ణంగా ఈ పాయింట్లు ట్రాన్సాక్ష‌న్‌, కార్డుల‌ను బట్టి ఉంటాయి. కొంద‌రు రూ.100 ఖ‌ర్చుకు 1 పాయింట్ ఇస్తే, కొంద‌రు 0.5 పాయింట్ల‌ను ఇస్తారు. కార్డుల‌ను బ‌ట్టి, కార్డుల‌ను జారీ చేసే ఫైనాన్స్ సంస్థ‌ల‌ను బ‌ట్టి ఈ రివార్డు పాయింట్లు మారుతాయి. ఇక రివార్డు పాయింట్ల‌ను కొన్ని బ్యాంకులు న‌గ‌దుగా మార్చుకునేందుకు అవ‌కాశం క‌ల్పిస్తాయి. కానీ కొన్ని బ్యాంకులు మాత్రం వోచ‌ర్ల‌ను ఇస్తాయి. అయితే రివార్డు పాయింట్ల‌ను ఎప్ప‌టికప్పుడు వాడుకోవాలి. లేదంటే అవి ఎక్స్‌పైర్ అవుతాయి.

ఈ స‌మాచారం మీకు న‌చ్చితే మీకు తెలిసిన అంద‌రికీ ఈ లింక్‌ను షేర్ చేయండి..!

Read more RELATED
Recommended to you

Latest news