నేటి అరచేతిలో సమస్త విశ్వాన్ని చూపిస్తున్న మొబైల్ ఫోన్లు.. మానవాళికి ఎంత ప్రయోజనంగా ఉన్నా యో.. అదేసమయమంలో ప్రజల్లో అంతే భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయి. లేనిపోని ఆందోళనలకు గురి చేస్తున్నాయి. ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలుసుకునే లోగానే సోషల్ మీడియా చేస్తున్న ప్రచారం ప్రజలను తీవ్ర గందరగోళానికి గురి చేస్తోంది. నిజానికి సోషల్ మీడియా వల్ల ప్రతి ఒక్కరికీ సమాచారం నిముషాలు సెకన్ల వ్యవధిలో చేరే అద్బుతమైన సాంకేతిక వ్యవస్థ వచ్చింది. ఇది ఎంతో ఆనందకర విషయం. అయితే, దీనిని సాకుగా తీసుకుని నకిలీ రాయుళ్లు ప్రజలను తప్పు బాటలో నడిపిస్తున్నారు. ఆందోళనకు గురి చేస్తున్నారు.
ఫలితంతో ప్రజల్లో లేనిపోని ఆందోళన, ఖంగారు పెరిగి, ఆరోగ్య సమస్యలుకూడా ఉత్పన్నమవుతు న్నా యి. తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్ వాసుల్ని కల్లోలానికి గురిచేసింది. సోషల్ మీడియాలో నిన్నటి నుంచి ప్రచారం అవుతున్న ట్రాఫిక్ రూల్స్, చలానాల పెంపు వంటి కీలక విషయాలపై ప్రచారం జరుగుతోంది. అయితే, ఇది ప్రజల అవగాహనకు ఉపయోగపడితే. అంతకు మించిన అదృష్టం ఉండదు. కానీ, ప్రజలను ఆందోళనకు గురిచేసేలా, వారిలో బీపీని పెంచేలా ఉండడమే పెద్ద మైనస్‌గా మారిపోయింది. రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది.
ప్రపంచంలోనే రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్యలో భారత్ ముందుంది. దీంతో రహదారి భద్రతకు కేంద్రం పెద్దపీట వేసింది. ఈ క్రమంలోనే ప్రాథమిక చర్యల్లో భాగంగా వాహనం నడుపుతున్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను మరింత కఠినం చేసింది. హెల్మెట్, సీటు బెల్ట్, లైసెన్స్, ఇన్‌స్యూరెన్స్, ఓవర్ లోడ్ వంటివాటిపై ప్రత్యేకంగా సెప్టెంబరు ఒకటి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు డ్రైవ్‌లు చేపట్టనున్నాయి. ఈ క్రమంలోనే వాటిని ఉల్లంఘించిన వారికి భారీ మొత్తంలో జరిమానా వేసేందుకు సిద్ధమయ్యాయి. ఇది సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి రానుంది.
అయితే, ఇప్పుడు దీనిపై అవగాహన లేని కొందరు ప్రబుద్ధులు.. దున్న ఈనిందిరా అంటే దూడను కట్టేయండి అనే టైపులో.. సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు. ఇప్పటి వరకు ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించి పట్టుబడిన వారికి పోలీసులు, రవాణా శాఖ అధికారులు జారీ చేసిన చలానాలను కట్ట ఈ నెల 31 లోగా చెల్లించకపోతే.. 1 వ తేదీ నుంచి కొత్త చట్టం ప్రకారం భారీ ఎత్తున ఆ జరిమానాలు పెరుగుతాయంటూ ప్రచారం ప్రారంభించారు. దీంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. అయితే, దీనిపై స్పందించిన హైదరాబాద్ పోలీసులు తూచ్! అదేం లేదు. ఎప్పటిది అప్పుడే.. వచ్చే నెల నుంచి మాత్రమే కొత్త చట్టం ప్రకారం ఫైన్‌లు ఉంటాయని వెల్లడించి ప్రజలకు భరోసా ఇచ్చారు. సో.. ఇదీ సోషల్ మీడియా కథ!!
#HYDTPinfo The below message which is circulating in Social Media is “FAKE”. @AddlCPTrHyd pic.twitter.com/6UWOTrLm3k
— Hyderabad Traffic Police (@HYDTP) August 27, 2019