రోజురోజుకు బై నౌ.. పే లేటర్ విధానానికి ఆధరణ విపరీతంగా పెరుగుతోంది. ఒక్క మాటాలో చెప్పాలంటే దీని అర్థం క్రెడిట్ కార్డు లేకుండానే క్రెడిట్ పొందే విధానం. ఇప్పుడు అసలు అవి మంచివేనా? అవి పనిచేసే విధానం తెలుసుకుందాం. వివిధ కంపెనీలు ఈ బై నౌ.. పే లేటర్ ఆప్షన్ ని వినియోగదారులకు అందిస్తున్నాయి. అంటే దీని ద్వారా ఇప్పుడు కొనుగోలు చేసిన వస్తువులకు కొన్ని రోజుల తర్వాత డబ్బులు చెల్లించే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఏదైనా వస్తువు కొనాలనుకుంటే కొన్ని నెలలపాటు డబ్బు జమ చేసుకొని కొనేవారు. కానీ, ఇప్పుడు ఈఎంఐ ఆప్షన్లు, క్రెడిట్ కార్డుల ద్వారా దీన్ని కొనడం చాలా సులభతరంగా మారిపోయింది.
ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసిన ఫిన్ టెక్ కంపెనీలు‘బై నౌ.. పే లేటర్’ ఆప్షన్ ని ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ఆప్షన్ రెండు మూడు సంవత్సరాల క్రితమే అందుబాటులోకి వచ్చినా కరోనా నేపథ్యంలో ఈ ఆప్షన్ చాలా ఫేమస్ గా మారిపోయింది. ఈ సంస్థలకు ఎక్కువగా టైర్ 2, 3 సిటీల్లోనే వినియోగదారులున్నారట. తమ వినియోగదారుల్లో 68 శాతం మంది ఈ నగరాల్లో ఉన్నట్లు టైర్ 1 సిటీల్లో ఉన్నవారు కేవలం 32 శాతమే అని జెస్ట్ మనీ సంస్థ వెల్లడించింది.
మిలినియల్స్ ఈ ఆప్షన్ ని వస్తువులను కొనుక్కొని ఆ తర్వాత దాన్ని ఈఎంఐ రూపంలోకి మార్చుకుంటున్నారు. దీనికి చాలా మంది అలవాటుపడ్డారు. ఈ స్కీంను ఎంచుకొని కొత్త వస్తువులు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. 2020 రిపోర్ట్ ప్రకారం ఈ స్కీం ద్వారా చాలామంది ఆన్ లైన్ ఎడ్యుకేషన్, స్మార్ట్ ఫోన్లను కొనడం, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఫ్యాషన్ ఉత్పత్తుల కొనుగోలుతో పాటు ప్రయాణాలకు కూడా ఉపయోగించారట.
దీనిపై స్పందించిన జెస్ట్ మనీ సీఈఓ లిజీ చాప్ మాన్ ‘కొన్నేళ్లలో ఎప్పుడూ లేనంతగా ఈ పథకాన్ని ఎక్కువ మంది ఉపయోగించారు. ఈ అలవాటు అలాగే కొనసాగుతుంది. ఈ స్కీం చాలామందికి నచ్చుతోంది’ అన్నారు. ముంబై, బెంగళూరు, ఢిల్లీ లాంటి నగరాలకు చెందిన వారు ఎక్కువ శాతం ఈ స్కీంను ఉపయోగిస్తున్నారట.
బై నౌ, పే లేటర్ ఎలా పనిచేస్తుందంటే..
- ముందు ఓ ఫిన్ టెక్ కంపెనీలో ఎన్ రోల్ చేసుకున్న తర్వాత ఆ సంస్థ ఆఫర్ చేసే ఆన్ లైన్ స్టోర్ల నుంచి వివిధ వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఆ తర్వాత పదిహేను నుంచి నెల రోజుల తర్వాత మీరు ఆ వస్తువుకి సంబంధించిన బిల్లును చెల్లించే వీలుంటుంది. గడువు దాటితే కొద్దిగా వడ్డీని చెల్లించాల్సి వస్తుంది. ఈ వడ్డీ మీ బిల్ అమౌంట్ ని బట్టి ఉంటుంది. మరీ ఎక్కువ ఖరీదు పెట్టి కొనే కొన్ని వస్తువులకు నో కాస్ట్ ఈఎంఐ రూపంలో కూడా చెల్లించే ఆప్షన్ ని కొన్ని సంస్థలు అందిస్తున్నాయి.
- అమెజాన్ పే, ఈపే లేటర్, కిష్ట్, లేజీ పే, సింపుల్, జెస్ట్ మనీ వంటివి చెప్పుకోవచ్చు. వీటిని లాగిన్ అయ్యి మీరు వాటి సేవలను పొందవచ్చు. లాగిన్ కాగానే మీ క్రెడిట్ ప్రొఫైల్ ని బట్టి మీకు కొంత క్రెడిట్ లిమిట్ ని ఆ సంస్థలు అందిస్తాయి. ఈ ఆప్షన్ ఫ్లిప్ కార్ట్, అమెజాన్, బిగ్ బాస్కెట్ వంటి ఆన్ లైన్ షాపింగ్ ప్లాట్ ఫాంలో అందుబాటులో ఉంది. వీటితో పాటు జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ యాప్స్, గో ఐబిబో కూడా అందుబాటులో ఉన్నాయి.
ఉదాహరణకి మీరు సింపుల్ యాప్ లో 3500 కొనుగోలు చేసి పదిహేను రోజుల తర్వాత బిల్లు చెల్లించలేకపోతే పెనాల్టీగా రూ.350 + జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది. కిష్ట్ యాప్ లో ఈ వడ్డీ 21 శాతంగా ఉంది - ఈ ఛార్జీలు చాలామందికి తక్కువగానే అనిపిస్తుంటాయి కానీ సరిగ్గా మేనేజ్ చేయలేకపోతే పెద్దగా మారి ఇబ్బంది పెడతాయి. ఒకసారి ఈ బిల్లులు చెల్లించడం మిస్ అయితే అది మీ క్రెడిట్ స్కోర్ పై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ స్కీములతో పోల్చితే బ్యాంకులు అందించే పర్సనల్ లోన్ చాలా తక్కువ వడ్డీకే లభిస్తాయి. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే 8.9 నుంచే 10.5 శాతం వరకు వడ్డీతో వీటిని అందిస్తున్నాయి. అయితే ఈ స్కీములలో ఒక్కసారి చెల్లింపులు ఆగిపోతే క్రెడిట్ స్కోర్ పై ఇది ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది.