పాలసీ అంగీకారానికి కొన్ని గంటలే సమయం.. ఆ తర్వాత?

మీరు వాట్సప్‌ కొత్త పాలసీ అంగీకరించడానికి ఇంకొన్ని గంటలే సమయం ఉంది. గడువు లోగా కొత్త రూల్స్‌ అంగీకరించకపోతే ఏం జరుగుతుందో తెలుసుకోండి. వాట్సప్‌ కొత్త ప్రైవసీ పాలసీ ఈ ఏడాది దుమారం రేపిన సంగతి తెలిసిందే. వాట్సప్‌ మొదట జనవరిలో కొత్త ప్రైవసీ పాలసీ ప్రకటించింది. ఫిబ్రవరి 8 లోగా ఈ పాలసీని అంగీకరించాలని డెడ్‌లైన్‌ విధించింది. దీంతో పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. లక్షలాది మంది వినియోగదారులు ఈ యాప్‌ డిలిట్‌ చేశారు. ప్రత్యామ్నాయ యాప్స్‌ వైపు మొగ్గు చూపారు.

 

కొత్త ప్రైవసీ పాలసీ వివాదం కావడంతో వాట్సప్‌ దిగొచ్చింది. కొత్త ప్రైవసీ పాలసీని వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత వాట్సప్‌ మళ్లీ కొత్త ప్రైవసీ పాలసీ ప్రకటించింది. దీనిలో వినియోగదారుల డేటాకు మాది భరోసా అంటూ వివరణ తప్ప అందులో ఏమీ లేదు. వినియోగదారుల డేటాను ఫేస్‌బుక్‌తో పంచుకుంటాం అన్న విషయంలో వాట్సప్‌ వెనక్కి తగ్గలేదు.

ఈ పాలసీని అంగీకరించడానికి 2021 మే 15 చివరి తేదీ. అంటే వినియోగదారులు అప్పట్లోగా కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరించాలి. ఇప్పటికే చాలామంది యూజర్లు కొత్త పాలసీని అంగీకరించారు.
అయితే, కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరించకపోతే అకౌంట్‌ డిలిట్‌ చేయబోమని ఇప్పటికే వాట్సప్‌ క్లారిటీ ఇచ్చింది. కానీ, గతంలో ఉపయోగించినన్ని ఫీచర్స్‌తో వాట్సప్‌ యాప్‌ను మే 16 నుంచి ఉపయోగించలేరు.

మీకు ఛాట్‌ లిస్ట్‌ కూడా కనిపించదు. వాట్సప్‌లో కాల్స్‌ కూడా కొన్ని రోజులపాటు చేసుకోవచ్చు. మీ ఖాతాకు సంబంధించిన నోటిఫికేషన్స్‌  కూడా రావు. ఆ తర్వాత కొన్ని వారాలకు మీ వాట్సప్‌కు మెసేజెస్, కాల్స్‌ కూడా రావు. అలాగే, మీకు వాట్సప్‌ కొత్త ప్రైవసీ పాలసీ ఇష్టం లేకపోతే అకౌంట్‌ డిలిట్‌ చేసి ప్రత్యమ్నాయంగా ఇతర యాప్స్‌ ఉపయోగించొచ్చు.