రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇప్పటికే నెఫ్ట్ సేవలను రోజుకు 24 గంటలపాటు అందిస్తున్న విషయం విదితమే. గతంలో కేవలం పనిదినాల్లో మాత్రమే అది కూడా రోజులో బ్యాంకులు పనిచేసే సమయాల్లోనే నెఫ్ట్ సేవలు అందుబాటులో ఉండేవి. కానీ ప్రస్తుతం రోజులో ఎప్పుడైనా నెఫ్ట్ సేవలను ఉపయోగించుకునే వీలు ఏర్పడింది. అయితే ఇకపై ఆర్‌టీజీఎస్ సేవలను కూడా రోజులో ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. కొత్త రూల్ సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు ఆర్‌బీఐ తాజాగా నిర్వహించిన మానెటరీ పాలసీ మీటింగ్ లో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో రోజుకు 24 గంటలూ ఆర్టీజీఎస్ సేవలు లభిస్తున్నాయి.
కాగా ఆర్‌టీజీఎస్ ద్వారా రియల్‌టైంలో ఇతరులకు నగదును ఆన్‌లైన్‌లో పంపించవచ్చు. ఈ పద్ధతిలో కనీసం రూ.2 లక్షలను పంపాల్సి ఉంటుంది. గరిష్టంగా ఎంత మొత్తం అయినా పంపించవచ్చు. ఇందుకు ఎలాంటి చార్జిలు లేవు. నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ సేవలకు ఎలాంటి చార్జిలను వసూలు చేయడం లేదని ఆర్‌బీఐ గతంలోనే తెలిపింది. దీంతో ఎంత మొత్తంలో డబ్బును అయినా ఆర్టీజీఎస్ ద్వారా పంపించుకోవచ్చు.
కాగా ఆర్టీజీఎస్‌ను 2004 మార్చి 26న ప్రవేశపెట్టగా ప్రస్తుతం రోజుకు 6.35 లక్షల లావాదేవీలు ఆ పద్ధతిలో జరుగుతున్నాయి. నిత్యం రూ.4.17 లక్షల కోట్లను 237 బ్యాంకులు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాయి. ఈ పద్ధతిలో సగటున రూ.57.96 లక్షల సొమ్మును పంపించుకుంటున్నారు. ఐఓఎస్‌వో 20022 పద్ధతిలో ఆర్టీజీఎస్ పనిచేస్తుంది. రియల్‌టైంలో దీని ద్వారా అవతలి వారికి ఆన్‌లైన్‌లో నగదును పంపించవచ్చు.