మీ బండి పోయిందా… ఈ సైట్‌లో చెక్ చేసుకోండి..!

వాహనాలను పోగొట్టుకున్న వారికి రాచకొండ పోలీసులు శుభవార్త తెలిపారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్‌ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో దొరికిన వాహనాలను సదరు యజమానులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనరేట్‌ నుంచి ఓ ప్రకటన విడుదల అయింది. రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 706 వాహనాలు దొరికినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందులో బైకులతో పాటు ఆటోలు కూడా ఉన్నాయి. అయితే ఆయా వాహనాల యజమానులు తిరిగి తమ వాహనాన్ని పొందాలనుకుంటే 15 రోజుల్లో అంబర్‌పేటలోని రాచకొండ కార్‌ హెడ్‌క్వార్టర్స్‌లో సంప్రదించాల్సి ఉంటుందని రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ తెలిపారు.

 

కాగా దొరికిన వాహనాల వివరాలను రాచకొండ పోలీస్ కమిషనరేట్‌ వెబ్ సైట్ https://rachakondapolice.telangana.gov.in/ లో పొందుపరిచినట్లు వెల్లడించారు. సైట్‌లో తమ వాహన వివరాలు ఉన్న యజమానులు వాహనానికి సంబంధించి ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని సీపీ స్పష్టం చేసారు. సరైన పత్రాలు లేని వాహనాలను త్వరలో బహిరంగ వేలంలో విక్రయించనున్నట్లు ప్రకటించారు. కావున వాహనాలను పోగొట్టుకున్న యజమానులు ముందుగా రాచకొండ పోలీస్ కమిషనరేట్‌ వెబ్ సైట్‌లో వివరాలను చెక్ చేసి, అందులో తమ వాహన వివరాలు ఉన్నట్లయితే … అనంతరం వాహనానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రం తీసుకొని రాచకొండ కార్‌ హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్లి తమ వాహనాన్ని తిరిగి పొందవచ్చు.