పోస్టాఫీసులో మనకు ఎన్నో స్కీమ్స్ ఉంటాయి. చిన్న చిన్న అమౌంట్‌తో సేవ్ చేసుకుంటూ జీవితంలో వచ్చే ఖర్చులకు ముందే ప్లాన్ చేసుకుంటారు. పోస్టాఫీసు ఇన్సూరెన్స్ పాలసీలు కూడా ఆఫర్ చేస్తుంది. ఈ విషయం దేశంలోని చాలా మందికి తెలీదు. పోస్టాఫీస్ అంటే స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్/ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్ మాత్రమే అమలు చేస్తుందనుకుంటారు. తపాలా శాఖ అందిస్తున్న బెస్ట్ స్కీమ్స్‌లో ఒకటి “పోస్టల్ జీవిత బీమా పథకం” (Postal Life Insurance – PLI). ఈ స్కీమ్ తీసుకునే వ్యక్తికి 50 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ కవరేజీ సహా చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.
పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్
పోస్టాఫీస్ జీవిత బీమా పథకంలో డబ్బును పెట్టుబడి పెట్టేందుకు 2 కేటగిరీలలో ఆప్షన్లు ఉంటాయి. ఒకటి PLI, రెండోది RPLI. పీఎల్‌ఐ స్కీమ్ కింద 6 రకాల పాలసీలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. వాటిలో ఒకటి ‘హోల్ లైఫ్ అస్యూరెన్స్ పాలసీ’. ఇది సంపూర్ణ జీవిత బీమా పథకం. ఈ పాలసీ కింద, హామీ మొత్తం కనిష్టంగా రూ. 20,000 నుంచి గరిష్టంగా రూ. 50 లక్షల వరకు చేతికి వస్తాయి. ఈ పాలసీ కొన్న వ్యక్తి 80 సంవత్సరాలకు సమ్ అష్యూర్డ్ బెనిఫిట్ పొందుతాడు. దీని కంటే ముందే బీమాదారు మరణిస్తే, నామినీకి ఆ డబ్బు ఇస్తారు.
లోన్ ఫెసిలిటీ
ఈ పాలసీ తీసుకుని 4 సంవత్సరాలు పూర్తయితే లోన్ ఎలిజిబిలిటీ వస్తుంది. పాలసీహోల్డర్, తన పాలసీని హామీగా ఉంచి రుణం కూడా తీసుకోవచ్చు. బీమా కొన్న తర్వాత, ఏ కారణం వల్లనైనా దానిని కొనసాగించలేకపోతే, 3 సంవత్సరాల తర్వాత సరెండర్ చేసే వెసులుబాటు ఉంది. పాలసీని సరెండర్ చేయాలి అనుకుంటే, ఒక విషయాన్ని కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. బీమా పాలసీని తీసుకున్న 5 ఏళ్ల లోపు సరెండర్ చేస్తే బోనస్ లభించదు. 5 సంవత్సరాల తర్వాత సరెండర్ చేస్తే, హామీ మొత్తంపై, పాలసీ కొనసాగించిన కాలానికి దామాషా ప్రకారం బోనస్ చెల్లిస్తారు.
కనిష్ట – గరిష్ట వయో పరిమితి ఎలా ఉంటుందట..
PLI హోల్ లైఫ్ అస్యూరెన్స్ పాలసీ తీసుకోవడానికి ఒక వ్యక్తికి కనీసం 19 సంవత్సరాల వయస్సు, గరిష్టంగా 55 ఏళ్ల వయస్సు ఉండాలి. ఈ పాలసీ కొనాలంటే పోస్టాఫీస్‌కు వెళ్లక్కర్లేదు, ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్ ద్వారా తీసుకోవచ్చు. పోస్టాఫీస్ అధికారిక వెబ్‌సైట్ https://pli.indiapost.gov.in లోకి వెళ్లి ఈ పాలసీని తీసుకోవచ్చు. ఇదే సైట్ నుంచి మరిన్ని వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ప్రీమియం చెల్లింపు, దాని తాలూకు రిసిప్ట్, ఆదాయ పన్ను సర్టిఫికేట్ సహా సంబంధిత డాక్యుమెంట్స్ డిజిటల్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉంటాయి, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు దగ్గర్లోని పోస్ట్ ఆఫీస్‌కు వెళ్లి కూడా ఈ స్కీమ్‌లో జాయిన్ అవ్వొచ్చు.
పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు:
పోస్టల్ జీవిత బీమా పాలసీని కనీసం 4 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు. ఆ తర్వాత డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు.
ఈ పాలసీతో సమ్ అజ్యూర్డ్ బెనిఫిట్ లభిస్తుంది.
మెచ్యూరిటీ అమౌంట్‌ను బీమా చేసిన వ్యక్తికి/అతను మరణిస్తే నామినీకి ఇస్తారు.
3 సంవత్సరాల తర్వాత పాలసీని రద్దు చేసుకోవాలని భావిస్తే, పాలసీని సరెండర్ చేసే ఫెసిలిటీ ఉంది.
ప్రభుత్వ & ప్రభుత్వ రంగ ఉద్యోగుల కోసం మాత్రమే తొలుత ఈ పాలసీని తీసుకువచ్చారు.
ఆ తర్వాత మార్పులు చేసి, దేశంలోని ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఇది ఉద్యోగులకు చాలా మంచి స్కీమ్. మీకు ఒక 26, 27 సంవత్సరాలు ఉంటే.. నెలకు రూ. 1900 కడితే చాలు.. మీకు 50 ఏళ్లు వచ్చేసరికి 10,72,000 వస్తుంది.