ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతోందంటూ పలు రాజకీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో 1984, మే 5న ఈవీఎంల వినియోగాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది.
ఇది ఎన్నికల నామ సంవత్సరం కాబోలు. తెలంగాణలో అయితే గత సంవత్సరం నుంచి ఎన్నికల హడావుడి ప్రారంభమయింది. ఎన్నికలు అనగానే మనకు ముందు గుర్తుకొచ్చేది ఈవీఎం. అవును.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ దాని పూర్తిపేరు. అయితే… ఈవీఎంలనే ఓటింగ్ కోసం ఎందుకు వాడుతున్నారు. ఈవీఎంలు రాకముందు ఏవిధానంలో ఓటింగ్ ప్రక్రియ ఉండేది. ఈవీఎంలను తీసుకురావడానికి కారణం ఏంటి? ఇలా.. చాలామందికి ఈవీఎంలపై సవాలక్ష ప్రశ్నలు ఉంటాయి. వాటిని తీర్చే ప్రయత్నమే ఇది..
ఈవీఎంల కంటే ముందు బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరిగేవి. బ్యాలెట్ విధానం అంటే మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఇటీవలే జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మీరు ఓటు వేసింది బ్యాలెట్ విధానం ద్వారానే. అదే బ్యాలెట్ విధానం. మీరు ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసింది ఈవీఎం మిషన్ మీద. ఒకవేళ మీరు ఏపీకి చెందిన వారయితే 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మీరు ఓటు వేసింది ఈవీఎం మిషన్ మీద.
బ్యాలెట్ విధానం వల్ల ఎక్కువ ఖర్చు, సమయం తీసుకుంటుండటం వల్ల కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంలను ప్రవేశపెట్టింది. ఈవీఎంలను మొదటిసారి కేరళలోని పరూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 1982 మే 19న వినియోగించారు. ఆ తర్వాత 1982, 83లో దేశ వ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల్లోనూ ఈవీఎంలను ఉపయోగించారు. అయితే.. ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతోందంటూ పలు రాజకీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో 1984, మే 5న ఈవీఎంల వినియోగాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది.
అయితే.. 1988లో అప్పటి కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 61ఏ ప్రకారం ప్రజా ప్రాతినిధ్య చట్టంతో ఈవీఎంల వాడకాన్ని చేర్చింది. ఆ చట్టంలోని సెక్షన్ 61ఏ సవరణ.. 1989 మార్చి 15న అమలులోకి వచ్చింది. ఆ తర్వాత ఈవీఎంలపై 1990 జనవరిలో ఎన్నికల సంస్కరణల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదే సంవత్సరం ఏప్రిల్‌లో ఈవీఎంల వాడకాన్ని సాంకేతిక నిపుణుల కమిటీ సమర్థించింది. 1998లో దానికి ప్రజామోదం లభించింది.
1999, 2004 సంవత్సరాల్లో కొన్ని రాష్ర్టాల్లో జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలనే వాడారు. తర్వాత 2004 నుంచి 14 మధ్య జరిగిన లోక్‌సభ ఎన్నికలకు కూడా ఈవీఎంలనే వాడారు. ఆ తర్వాత 2013 ఆగస్టు 14న ఈవీఎంలకు వీవీప్యాట్‌ను అనుసంధానం చేయాలని డిసైడ్ చేశారు. 2013 సెప్టెంబర్ 4న వీవీ ప్యాట్‌లను మొదటిసారిగా నాగాలాండ్‌లోని నాక్సెన్ అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించారు. అప్పటి నుంచి వీవీప్యాట్‌లను ప్రతి ఎన్నికల్లోనూ వినియోగించుకోవచ్చని సుప్రీం ఆదేశించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం 2017లో 16.15 లక్షల వీవీ ప్యాట్‌లను కొనుగోలు చేసింది. వాటి కొనుగోలుకు 3173.47 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ వీవీప్యాట్‌లను వినియోగించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ వాటిని వినియోగించనున్నారు. అది క్లుప్తంగా ఈవీఎంల స్టోరీ.