కొత్త సంవత్సరం రానే వచ్చింది. అటు చూసి ఇటు చూసేలోగా.. 2018 అయిపోయింది. 2019కి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పడానికి నగరం సిద్ధమైంది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండటం కోసం నగరంలో ఇవాళ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ రాత్రి హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు పోలీసులు.
ఇవాళ రాత్రి 10 నుంచి ఉదయం 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా బేగంపేట ఫ్లయిఓబర్ తప్పించి… నగరంలోని మిగితా ఫ్లయిఓవర్లన్నింటినీ మూసేస్తున్నట్టు ఆయన తెలిపారు.
నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే వాహనాలు ఖైరతాబాద్, రాజ్‌భవన్ వైపు నుంచి వెళ్లాలి. బీఆర్‌కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలు.. తెలుగుతల్లి జంక్షన్ నుంచి ఇక్బాల్ మినార్, లక్డీకపూల్ వైపు వెళ్లాలి.
హిమాయత్ నగర్, లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాళ్లు జీహెచ్‌ఎంసీ వై జంక్షన్ నుంచి బీఆర్‌కే భవన్ ద్వారా.. తెలుగుతల్లి ఫ్లయిఓవర్ నుంచి ఇక్బాల్ మినార్ వైపు వెళ్లాలి. ఖైరతాబాద్ మార్కెట్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలు ఖైరతాబాద్ బడా నుంచి సెన్సేషన్ థియేటర్, రాజదూత్‌లైన్ వైపు వెళ్లాలి.
మింట్‌కాంపౌండ్ ద్వారా సచివాలయం రూట్‌లో సాధారణ వాహనాలకు అనుమతి లేదు. ఆ రోడ్డును ఇవాళ మూసేస్తారు. నల్లగుట్ట రైల్వే బ్రిడ్జి ద్వారా సంజీవయ్య పార్కు, నెక్లెస్ రోడ్డు వైపు వాహనాలకు అనుమతి లేదు. వాళ్లు కర్బాల మైదాన్, మినిస్టర్ రోడ్ ద్వారా వెళ్లాలి. ఇక.. సికింద్రాబాద్ నుంచి వచ్చే వాళ్లు సేలింగ్ క్లబ్ నుంచి కవాడిగూడ క్రాస్ రోడ్ వైపు వెళ్లాలి.