ఒకే చోట కూర్చోవడం ఎప్పుడూ బోరింగే. అప్పుడప్పుడు నచ్చిన ప్రదేశాలకు ప్రయాణాలు చేస్తూ ఉండాలి. ఇక్కడ చిక్కు ఏమిటంటే.. మనకు ప్రయాణం చేయాలి అనిపించినపుడు తోడుగా ఎవ్వరూ రాకపోవడం. ఇలాంటి సమస్యను మీరు ఎదుర్కొంటే ఒంటరిగా ప్రయాణాలు చేయండి.
ఒంటరిగా ప్రయాణాలు చేయడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే ఈరోజే మీరు భుజానికి బ్యాగ్ వేసుకుంటారు.
ఎక్కడికైనా వెళ్ళొచ్చు:
ఒంటరి ప్రయాణంలో మీ ఇష్టమున్న చోటికి వెళ్ళొచ్చు. అక్కడికి వద్దు, ఇక్కడికి వద్దు అనే నిబంధనలు ఉండవు. మీకు అడ్డు చెప్పేవాళ్ళే ఉండరు. నలుగురితో కలిసి వెళ్ళాలనుకుంటే అందరికీ నచ్చిన ప్రదేశానికి మాత్రమే వెళ్ళాలి. అదే ఒంటరిగా వెళ్తే మీ ఇష్టమున్న చోటుకు చేరుకోవచ్చు.
డబ్బు ఖర్చు తక్కువ:
ఒంటరిగా వెళ్తే ఎక్కువ ఖర్చు అవుతుందని అనుకుంటారు కానీ ఇలా వెళ్తేనే డబ్బులు సేవ్ అవుతాయి. నలుగురితో ఉన్నప్పుడు వారేదైనా కొంటే.. మొహమాటానికి పోయి కొనాల్సి ఉంటుంది. ఇక్కడైతే అలా ఏమీ ఉండదు.
మీ గురించి మీకు తెలుస్తుంది:
ఒంటరిగా ప్రయాణాలు చేసినపుడు మీలోని సామర్థ్యం మీకు అర్థమవుతుంది. నలుగురితో ఎలా మాట్లాడుతున్నారో, కొత్త వాళ్ళతో ఎలా డీల్ చేస్తున్నారో అర్థమవుతుంది.
కొత్త భాష నేర్చుకుంటారు:
కొత్త ప్రదేశాలకు వెళ్ళినపుడు అక్కడి సంస్కృతి, భాషలను గమనించవచ్చు. ఆసక్తిగా ఉంటే భాష నేర్చుకునే అవకాశం ఉంటుంది. నలుగురితో కలిసి వెళ్ళినపుడు అక్కడి వారి సంస్కృతి, భాషలను తెలుసుకునే అవకాశం ఉండదు.
అందుకే అప్పుడప్పుడు ఒంటరిగా ప్రయాణాలు చేయాలి.