ఇక‌పై 8వ త‌ర‌గ‌తి చ‌ద‌వ‌కున్నా స‌రే.. డ్రైవింగ్ లైసెన్స్ పొంద‌వ‌చ్చు..!

746

డ్రైవింగ్ లైసెన్స్‌కు క‌చ్చితంగా 8వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దువుకుని ఉండాలన్న నిబంధ‌న వ‌ల్ల నిజానికి ఎంతో మంది ఉపాధిని కోల్పోతున్నారు. క‌నీసం డ్రైవ‌ర్లుగా అయినా ప‌నిచేసుకుందామంటే.. కొంద‌రికి ఈ నిబంధ‌న వ‌ల్ల లైసెన్స్ ల‌భించ‌డం లేదు.

డ్రైవింగ్ రాగానే స‌రికాదు.. ఏ వాహ‌నం న‌డ‌పాల‌న్నా మ‌న‌కు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఇక అందులో ట్రాన్స్‌పోర్ట్‌, నాన్ ట్రాన్స్‌పోర్ట్ అని రెండు ర‌కాలు ఉంటాయి. ట్రాన్స్‌పోర్ట్ వాహ‌నాల‌ను న‌డ‌పాలంటే డ్రైవ‌ర్ల‌కు ఫిజిక‌ల్ ఫిట్‌నెస్‌తోపాటు బ్యాడ్జి కూడా ఉండాలి. అయితే ఎంత చ‌క్క‌గా డ్రైవింగ్ చేసిన‌ప్ప‌టికీ మ‌న దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఎవ‌రైనా స‌రే.. క‌చ్చితంగా 8వ త‌ర‌గ‌తి వ‌ర‌కైనా చ‌దువుకుని ఉండాలి. లేక‌పోతే డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వ‌రు.

అయితే డ్రైవింగ్ లైసెన్స్‌కు క‌చ్చితంగా 8వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దువుకుని ఉండాలన్న నిబంధ‌న వ‌ల్ల నిజానికి ఎంతో మంది ఉపాధిని కోల్పోతున్నారు. క‌నీసం డ్రైవ‌ర్లుగా అయినా ప‌నిచేసుకుందామంటే.. కొంద‌రికి ఈ నిబంధ‌న వ‌ల్ల లైసెన్స్ ల‌భించ‌డం లేదు. దీంతో వారికి ఉపాధి ల‌భించ‌డం క‌ష్ట‌త‌ర‌మ‌వుతోంది. అయితే ఈ ఇబ్బందుల‌ను తెలుసుకున్న కేంద్ర ప్ర‌భుత్వం ఇక‌పై ఈ నియ‌మాన్ని కొంత స‌డలించ‌నుంది. ఇక‌పై 8వ త‌ర‌గ‌తి చ‌ద‌వకున్నా స‌రే.. డ్రైవింగ్ లైసెన్స్‌ల‌ను తీసుకోవ‌చ్చు. అందుకు గాను కేంద్ర రోడ్డు ర‌వాణా, ర‌హ‌దారుల మంత్రిత్వ శాఖ నిబంధ‌న‌ల‌ను స‌వ‌రిస్తూ ఈ మేర‌కు తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీనికి గాను త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్ కూడా విడుద‌ల కానుంది.

అయితే డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు 8వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌ద‌వాల్సిన అవ‌స‌రం లేకున్నా స‌రే.. డ్రైవ‌ర్ల‌కు ట్రాఫిక్ రూల్స్‌, సింబ‌ల్స్ క‌చ్చితంగా తెలియాల్సిందేనని ఆ మంత్రిత్వ శాఖ స్ప‌ష్టం చేసింది. అంటే.. లైసెన్స్ పొందే స‌మ‌యంలో పెట్టే రూల్స్‌, సింబ‌ల్స్ ప‌రీక్ష‌లో మాత్రం పాస్ కావ‌ల్సి ఉంటుందన్న‌మాట‌. దీని వ‌ల్ల డ్రైవ‌ర్ల‌కు ర‌హ‌దారిపై ట్రాఫిక్ నియ‌మ నిబంధ‌న‌లు తెలుస్తాయి. అయితే కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యం వ‌ల్ల దేశంలోని అనేక ల‌క్ష‌ల మందికి ఉపాధి ల‌భిస్తుంద‌ని భావిస్తున్నారు. భ‌విష్య‌త్తులో ర‌వాణా రంగంలో 22 ల‌క్ష‌ల మంది డ్రైవ‌ర్ల అవ‌స‌రం ఉన్న నేప‌థ్యంలోనే కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని ప‌లువురు చెబుతున్నారు. ఏది ఏమైనా.. ఈ నిర్ణ‌యం వ‌ల్ల ఎంతో మందికి ల‌బ్ది చేకూర‌నుంది..!