తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌లపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ సమాజాన్ని ఆ ఇద్దరూ మోసం చేశారని అన్నారు. భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టి ఫాం హౌస్‌లను నిర్మించుకుంటూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని, ప్రజలను మోసం చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోమవారం విలేకరులతో సమావేశం నిర్వహించారు.
జన్‌వాడలో 301 నుంచి 313 వరకు ఉన్న సర్వే నంబర్లలో 25 ఎకరాలు, 445 సర్వే నంబర్‌లో 8 ఎకరాల స్థలం కేటీఆర్‌కు ఉందని. ఆయా స్థలాల్లో కేటీఆర్ అక్రమ నిర్మాణాలు చేపట్టారని, అందుకు అధికారులు ఇచ్చిన పత్రాలే సాక్ష్యమని రేవంత్ అన్నారు. ఈ మేరకు ఆయన పలు పత్రాలను మీడియాకు చూపించారు. తెరాస ఎమ్మెల్యే బాల్క సుమన్.. సీఎం కేసీఆర్‌ను నీతి నిజాయితీ ఉన్న సత్యహరిశ్చంద్రుడు అంటాడని.. అలాంటప్పుడు ఆయన తన నీతి నిజాయితీలను నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ సదరు భూముల వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లోనూ తెలియపరచలేదని, ప్రజలను ఆయన మోసం చేశారని అన్నారు. తమకు భూములు లేవని కేటీఆర్ ఓ వైపు బుకాయిస్తున్నారని, కానీ అధికారులు ఇచ్చిన డాక్యుమెంట్లలో మాత్రం ఆయనకు భూములు ఉన్నట్లుగా నిర్దారణ అయిందని అన్నారు. దీనిపై కేసీఆర్, కేటీఆర్‌లు సమాధానం చెప్పాలన్నారు.
భూ దందాలు చేస్తూ సీఎం కేసీఆర్, కేటీఆర్‌లు ఏమాత్రం సిగ్గు పడడం లేదని రేవంత్ ఎద్దేవా చేశారు. తనకు వట్టినాగులపల్లిలో భూమి ఉన్న మాట వాస్తవమేనని, అక్కడ తనకు 22 గుంటలు, తన భార్య తమ్ముడు, బావమరిది జయ ప్రకాష్ రెడ్డికి 20 గుంటల స్థలం ఉందని, అదంతా ఓపెన్ ల్యాండ్ అని, అక్కడ ఎలాంటి నిర్మాణాలు లేవని రేవంత్ తెలిపారు. ముందుగా వట్టినాగులపల్లి వెళ్దామని, అక్కడ ఏదైనా నిర్మాణం ఉంటే దాన్ని తానే కూల్చివేస్తానని, ఆ తరువాత జన్‌వాడకు వెళ్దామని, అక్కడ నిర్మాణం ఉంటే.. కూలుస్తారా ? అని రేవంత్.. కేసీఆర్, కేటీఆర్‌లకు సవాల్ విసిరారు.
కేటీఆర్‌ను కాపాడేందుకు కొందరు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు మిడత దండులా తనపై ఆరోపణలు చేస్తున్నారని, తనను తిడుతున్నారని.. రేవంత్ తెలిపారు. ఒక వేళ వారి తిట్లకు, ఆరోపణలకు తాను స్పందించి వాటి గురించి మాట్లాడితే అప్పుడు టాపిక్ డైవర్ట్ అవుతుందని.. దీంతో కేటీఆర్ చేసిన అక్రమాలను జనాలు మరిచిపోతారని సదరు మిడతల దండు భావిస్తుందని.. అందుకనే ఆ తిట్లు, ఆరోపణలకు తాను స్పందించడం లేదని రేవంత్ తెలిపారు. ప్రగతి భవన్, ఫాం హౌస్, జూబ్లీహిల్స్ గెస్ట్ హౌస్‌లలో ఉన్న కేసీఆర్, కేటీఆర్‌లు ఎందుకు దాక్కున్నారని, వెంటనే విషయంపై స్పందించి ప్రజల ఎదుట నిలబడి తమ నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. ప్రజా ప్రతినిధులకు పారదర్శకత ఉండాలన్నారు.
సీఎం కేసీఆర్ మాటకొస్తే ఉద్యమకారున్నని, అటుకులు తిని తెలంగాణ తెచ్చానని చెబుతుంటారని.. అంతటి సమర్ధుడు అయితే తన కొడుకు కేటీఆర్ అవినీతి బాగోతాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. కొడుకును మంత్రి పదవి నుంచి ఎందుకు తప్పించడం లేదని అన్నారు. కేటీఆర్ అక్రమాలపై ఎన్‌జీటీ నివేదిక ఇవ్వాలని కోరితే.. ఆయన కింద పనిచేసే అధికారులు ఆయనపై ఎలా నివేదిక ఇస్తారని.. కనుక కేటీఆర్‌ను మంత్రి పదవి నుంచి తప్పిస్తే.. విచారణ పారదర్శకంగా జరుగుతుందన్నారు. 2 నెలల పాటు మంత్రి పదవి లేకుండా ఉండలేవా కేటీఆర్ ? అని రేవంత్ ప్రశ్నించారు.
కేటీఆర్ అవినీతి బాగోతాన్ని తాము ప్రజల ముందు పెడతామని, ప్రజలే అందుకు తగిన తీర్పు ఇస్తారని రేవంత్ అన్నారు. సీఎం కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ అవినీతి అక్రమాలపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. 4 కోట్ల ప్రజలకు ఆ ఇద్దరూ సమాధానం చెప్పాలన్నారు. మాటకొస్తే తాము సత్యహరిశ్చంద్రులమని చెప్పుకునే వారు ఇప్పుడు తమ నీతి నిజాయితీలను ప్రజల ఎదుట నిరూపించుకోవాలన్నారు. వారు నిరూపించుకోకపోతే వారి బాగోతాలను కాంగ్రెస్ బయట పెడుతుందని తెలిపారు.
అందరి ముందు కేటీఆర్‌ను బజారులో నిలబెడతామని, ప్రజల ఎదుట కేటీఆర్ బాగోతాలను బట్ట బయలు చేస్తామని రేవంత్ తెలిపారు. ప్రజలకు నువ్వు ఆదర్శంగా ఉంటావా, ఉండవా..? అని ప్రశ్నించారు. ఈ విషయంపై కేటీఆర్ గొంతు ఎందుకు మూగబోయిందని అన్నారు. చీము నెత్తురు, పౌరుషం, తెలంగాణ రక్తం ఉంటే.. బయటకు వచ్చి మంత్రి పదవికి రాజీనామా చేసి తన నిజాయితీని కేటీఆర్ నిరూపించుకోవాలని రేవంత్ సవాల్ విసిరారు. కేటీఆర్ మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని, లేదంటే ఆయన్ను మంత్రి వర్గం నుంచి కేసీఆర్ తప్పించాలని డిమాండ్ చేశారు.