చైనాకు చెందిన, చైనా కంపెనీలతో సంబంధం ఉన్న 59 యాప్‌లను మోదీ సర్కారు నిషేధించిన విషయం విదితమే. కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ ఈ మేరకు ఆయా యాప్‌లను నిషేధిస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది. దేశ భద్రత, ప్రజల డేటాకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే ప్రజలు దీన్ని మోదీ ”డిజిటల్ స్ట్రైక్”గా అభివర్ణిస్తున్నారు.
అప్పట్లో పాకిస్థాన్ ఉగ్రవాదులు పుల్వామాలో భారత జవాన్లపై జరిపిన దాడికి మోదీ సర్కారు సర్జికల్ దాడులు జరిపి ప్రతీకారం తీర్చుకుంది. అయితే ఇప్పుడు చైనాపై మోదీ ప్రభుత్వం డిజిటల్ స్ట్రైక్ చేసిందని జనాలు అంటున్నారు. దీని వల్ల చైనా కుట్ర భగ్నమైందని నిపుణులు అంటున్నారు. అవును.. నిజమే.. ఇప్పుడే కాదు.. చైనా గతంలో ఎప్పటి నుంచో డిజిటల్ మార్గంలో ప్రపంచ దేశాలపై పట్టు సాధించాలని కుట్ర పన్నింది. అందులో భాగంగానే తమ దేశానికి చెందిన హువావే వంటి కంపెనీలతో కుమ్మక్కై అవి తయారు చేసే హార్డ్‌వేర్ ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు విక్రయించేలా ప్లాన్ వేసింది. చాలా సంవత్సరాల పాటు ప్రపంచ దేశాలకు హువావే సహా పలు ఇతర చైనా కంపెనీలు కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ హార్డ్‌వేర్, నెట్వర్కింగ్ ఉత్పత్తులను విక్రయిస్తూ వచ్చాయి. అయితే హువావేపై అమెరికా ఆంక్షలు విధించి ఆ కంపెనీ ఉత్పత్తులను తమ దేశంలో విక్రయించకుండా నిషేధం విధించింది. దీంతో ఆ కంపెనీ కన్ను సహజంగానే భారత్‌పై పడింది.
ఇక భారత్‌లో 5జీ నెట్వర్క్ అప్‌గ్రేడ్‌కు కావల్సిన హార్డ్‌వేర్‌ను తయారు చేసి ఇవ్వాల్సిందిగా ఇక్కడి కంపెనీలు హువావేతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. కానీ తాజాగా చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదంలో బీఎస్ఎన్ఎల్ సహా పలు కంపెనీలు హువావేతో ఉన్న కాంట్రాక్టులను రద్దు చేసుకున్నాయి. అయితే ఇప్పుడు మోదీ తాజాగా చైనాకు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీలపై కూడా దెబ్బ కొట్టారు. ఆ కంపెనీలు డెవలప్ చేసిన 59 యాప్‌లను నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో మోదీ చైనాపై జరిపిన డిజిటల్ స్ట్రైక్‌గా దీన్ని అభివర్ణిస్తున్నారు. దీని వల్ల భారత్‌పై డిజిటల్ మార్గంలో పట్టు బిగించాలనుకున్న చైనా ప్లాన్ ఫెయిలైంది. చైనా దీన్ని ”డిజిటల్ సిల్క్ రూట్”గా భావిస్తోంది. అయితే చైనా యాప్స్‌ను నిషేధించడంతో ఆ యాప్స్ భారత్ నుంచి పెద్ద ఎత్తున వచ్చే ఆదాయాన్ని, ఇక్కడి యూజర్ల బేస్‌ను కోల్పోనున్నాయి. ఇది ఆ యాప్ డెవలపర్ కంపెనీలకే కాదు.. చైనాకూ దెబ్బే..
నిజానికి చైనా యాప్స్ పైకి కనిపించేంత మంచి యాప్స్ కావని.. అవి యూజర్ల ఫోన్లలో వారికి తెలియకుండానే డేటాను చోరీ చేసి భారత్ బయట ఉన్న సర్వర్లలో ఆ డేటాను స్టోర్ చేస్తున్నాయని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. కానీ వాటిని ఆ యాప్ డెవలపర్ కంపెనీలు ఖండిస్తూ వచ్చాయి. ఇక ఇటీవలే షియోమీకి చెందిన యూసీ బ్రౌజర్ ఇన్‌కగ్నిటో మోడ్‌లో ఉన్నా కూడా యూజర్ల డేటాను చోరీ చేస్తుందని గుర్తించారు. దీంతో షియోమీకి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది. ఈ క్రమంలో ఆ కంపెనీ ఆ యాప్‌కు కొత్త అప్డేట్ను అందించి యాప్‌ను మళ్లీ విడుదల చేసింది. ఇక టిక్‌టాక్ యాప్ తాజాగా ఐఫోన్లలో యూజర్ల డేటాను వారికి తెలియకుండానే చోరీ చేస్తుందని గుర్తించారు. కానీ దీనిపై టిక్‌టాక్ డెవలపర్లు ఇంకా స్పందించలేదు. అయితే ఇంతలోనే ఆ యాప్‌తో కలిపి మొత్తం 59 యాప్‌లపై నిషేధం విధించడంతో.. ఇక ఇప్పుడు ఆ యాప్ డెవలపర్లకు ఒక్కసారిగా దిమ్మ తిరిగింది. వారు ఈ పరిణామాన్ని అస్సలు ఊహించలేదు. దీంతో ఈ యాప్‌ల ద్వారా సేకరించిన డేటాతో భారత్‌పై గుత్తాధిపత్యం చెలాయిద్దామనుకున్న చైనా ఆశలూ ఆవిరయ్యాయి.
అయితే చైనా డిజిటల్ సిల్క్ రూట్‌కు భారత్ బ్రేకులు వేయడంతో.. ప్రపంచ దేశాలు కూడా భారత్ బాటలోనే నడుస్తాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇతర దేశాలు కూడా ఈ యాప్స్‌ను తమ తమ ప్రాంతాల్లో నిషేధించవచ్చని సమాచారం. అసలు కరోనాతో చైనాపై పీకలదాకా కోపంతో ఊగిపోతున్న ఆయా దేశాలు ఈ రూపేణా చైనాపై ప్రతీకారం తీర్చుకుంటానికి తహతహలాడుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో చైనాకు, అది అపురూపంగా భావిస్తున్న డిజిటల్ సిల్క్ రూట్‌కు గట్టి దెబ్బ ఎదురయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. అదే నిజమైతే ప్రపంచ దేశాలపై డిజిటల్ మార్గంలో ఆధిపత్యం చెలాయిద్దామనుకున్న, ప్రపంచ దేశాల ప్రజలపై నిఘా పెడదామనుకున్న చైనా కుట్ర పూర్తిగా భగ్నమవుతుంది. మరి ముందు ముందు ఏం జరుగుతుందో.. అసలు ఈ యాప్‌లను ఎంత కాలం పాటు నిషేధిస్తారో చూడాలి..!