దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులతో పాటు మరణాలు కూడా ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. దీని ధాటికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పరీక్షల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో మాస్క్ లేనిదే బయట అడుగుపెట్టలేకపోతున్నారు మనుషులు. అధికారులు ఈ మహమ్మరిని అరికట్టేందుకు అన్నీ చర్యలు తీసుకుంటున్నారు.
అయినా దీని తీవ్రత మాత్రం తగ్గట్లేదు. కాగా, తాజాగా సోమవారం ఒక్కరోజే 2,084 కరోనా కేసులు, 57 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 85,161కు చేరగా, మొత్తం 2,680 మంది మరణించారు. అలాగే ఈ వైరస్ బారిన పడిన 56,235 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలో 26,246 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం బులెటిన్ విడుదల చేసింది.