కరోనా వైరస్‌కు ఆయుర్వేద ఔషధాలతో చికిత్స అందిస్తామంటే.. అది కొందరికి నచ్చలేదని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు. బుధవారం పతంజలి సంస్థలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొందరు తనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించారని, తనను జైల్లో వేసేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. తనను, పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణను విమర్శిస్తే విమర్శించండి.. కానీ కరోనాతో బాధపడుతున్న పేషెంట్ల పట్ల జాలి చూపాలని అన్నారు. కరోనైల్ మెడిసిన్‌పై వదంతులను వ్యాప్తి చేయవద్దని కోరారు.
కరోనైల్ మెడిసిన్‌ను తయారు చేయడంలో తాము పడ్డ శ్రమకు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ అభినందనలు సైతం తెలిపిందన్నారు. ఆ మెడిసిన్‌పై తాము చేపట్టిన క్లినికల్ ట్రయల్స్‌ను ఆ శాఖ ధ్రువీకరించిందన్నారు. కరోనాను కరోనైల్ మెడిసిన్ కచ్చితంగా నయం చేస్తుందని తాము ఇప్పటికీ 100 శాతం చెప్పగలమని ఆయన అన్నారు. ఆధునిక సైన్స్ పెట్టిన అన్ని నిబంధనలను తాము తూచా తప్పకుండా పాటిస్తూనే కరోనైల్ మెడిసిన్‌ను తయారు చేశామన్నారు. ఇక కరోనైల్ మెడిసిన్ ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తుందని ఆయన తెలిపారు.
కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ కరోనైల్ మెడిసిన్‌కు గాను కోవిడ్ మేనేజ్‌మెంట్ అనే పదాన్ని ఉపయోగించిందని, కోవిడ్ ట్రీట్‌మెంట్ అన్న పదాన్ని ఉపయోగించలేదని బాబా రాందేవ్ స్పష్టం చేశారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ తమ మెడిసిన్‌ను అందుబాటులో ఉంచుతామని తెలిపారు.