దేశంలోని ప్రముఖ నగరాల్లో ఒకటయిన తెలంగాణ రాజధాని హైదరాబాద్ ప్రస్తుతం డేంజర్ జోన్లో ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కరోనా టెస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని సూచించారు. కరోనాతో హైదరాబాద్ నగరం డేంజర్ జోన్లో ఉందని, ఎప్పుడు పేలుతుందో తెలియదని అన్నారు. కరోనా కట్టడి కోసం తెలంగాణకు కేంద్రం పెద్దఎత్తున సాయం చేసిందని, తెలంగాణలో బెడ్లు లేక కరోనా పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం కేంద్రం దృష్టికి వచ్చిందని తెలిపారు.
తెలంగాణలో పాత సచివాలయాన్ని కూల్చేందుకు హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం దాన్ని కోవిడ్ 19 ఆస్పత్రిగా ఉపయోగించుకుంటే 3వేల బెడ్లను అందుబాటులోకి తీసుకురావచ్చునని కిషన్ రెడ్డి సూచించారు. ఇంజినీరింగ్ కాలేజీలను కూడా ఐసోలేషన్ కేంద్రాలుగా ఉపయోగించాలని సూచించారు. హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, ముంబయి, చెన్నైలు కూడా డేంజర్ జోన్లో ఉన్నాయని కిషన్ రెడ్డి తెలిపారు.