కేరళలో సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్‌తోపాటు సందీప్ నాయర్ అనే మరో వ్యక్తిని ఎట్టకేలకు అరెస్టు చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఈ ఇద్దరినీ బెంగళూరులో అదుపులోకి తీసుకుంది. కేరళలోని తిరువనంతపురంకు చెందిన పలు కాంటాక్ట్‌ల ద్వారా ఈ ఇద్దరినీ ట్రేస్ చేసి పట్టుకున్నారు. ఇక ఈ స్మగ్లింగ్ కేసుతో సంబంధం ఉన్న మరో వ్యక్తిని కేరళలోని మళప్పురంలో పోలీసులు అరెస్టు చేశారు.
స్వప్న సురేష్ కేరళ సీఎం పినరయి విజయన్ నేతృత్వంలో కొనసాగుతున్న ఓ ఐటీ ప్రాజెక్టులో కీలక అధికారిణిగా ఉంది. అలాగే ఆమె గతంలో తిరువనంతపురంలో ఉన్న యూఏఈ కాన్సులేట్‌లో పనిచేసింది. తనకు ఉన్న పరిచయాల ద్వారా ఆమె దుబాయ్ నుంచి 30కిలోల బంగారాన్ని అక్రమంగా ఇండియాకు తీసుకువచ్చింది. జూలై 5వ తేదీన తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో స్వప్న సురేష్‌కు చెందిన ఓ భారీ బ్యాగ్‌లో 30 కిలోల బంగారం ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమెపై కేసు నమోదైంది. అప్పటి నుంచి ఆమె పరారీలో ఉంది. ఈ క్రమంలో ఆమెను అధికారులు ఆదివారం అరెస్టు చేశారు.
అయితే ఈ కేసు వల్ల తమ రాష్ట్ర ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని, కనుక దీన్ని సీబీఐచే విచారణ జరిపించాలని ఇప్పటికే కేరళ సీఎం పినరయి విజయన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. అయితే కేరళ ప్రతిపక్ష పార్టీలు ఇందులో సీఎం ప్రమేయం కూడా ఉందని ఆరోపిస్తున్నాయి.