కాంగ్రెస్ పార్టీ కరోనా కంటే ప్రమాదకరమని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు సృష్టించే భయాందోళనల వల్లే కరోనా రోగులు చనిపోతున్నారని ఆరోపించారు. ఉస్మానియా ఆసుపత్రిలోకి వర్షం నీరు చేరిన ఘటనకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీ నేతల వైఖరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్న అసెంబ్లీలోని టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఈ వాఖ్యలు చేసారు. గతంలో కిషన్ రెడ్డి, దత్తాత్రేయ, ఉత్తమ్, భట్టి అందరూ ఉస్మానియాకు కొత్త భవనాన్ని వ్యతిరేకించారని శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు.
కాంగ్రెస్ నేతలు 1978 నుంచి 2009 దాకా తెలంగాణకు ఒక కొత్త మెడికల్ కాలేజీని ఎందుకు తేలేకపోయారని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక ఐదు మెడికల్ కాలేజీలు తెచ్చామని తెలిపారు. ఉస్మానియాలో ఖాళీ జాగాలో నాలుగు అంతస్థులకు మించి భవనం కట్టడానికి లేదని విమర్శలు చేస్తున్న అజ్ఞానులకు తెలియదా ? అని విమర్శించారు.