ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం జగన్ దూకుడు… ప్రతిపక్షాలకు నిద్రపట్టని రాత్రులు గడిపేలా చేస్తుందనడంలో సందేహం ఉండకపోవచ్చు. గెలుపు ఓటములు రాజకీయాల్లో సహజమే కానీ… మళ్లీ జీవితంలో రాజకీయాల్లోకి వెళ్లలేని స్థాయిలో ఓటమి జరిగితే ఎలా ఉంటుంది? అలాంటి దెబ్బలు తిన్నవారి మాటలు, ప్రవర్తన, జగన్ పై ఉక్రోషం ఏ లెవెల్ లో ఉంటుందో చెబుతున్నారు మాజీ కాంగ్రెస్ నేతలు!
జగన్ తొందర్లో సీఎం ఛైర్ దిగిపోతారని చెప్పి ఆనందపడిపోయారు సబ్బం హరి! ఆ మాటల వల్ల ఆయనకు చెక్కొచ్చిందో, కిక్కొచిందో తెలియదు కానీ… తాజాగా మరో మాజీ కాంగ్రెస్ నేత తులసీరెడ్డి మైకందుకున్నారు. ప్రస్తుతం ఏపీలో జెండా ఎగరేసే కార్యకర్తలు కరువైన పరిస్థితుల్లో ఉండి, రాజకీయ నిరుద్యోగులకు నిలయంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పదవిలో ఉన్న తులసీ రెడ్డి… తాజాగా నిమ్మగడ్డ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించింది!
నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు విషయంలో ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయటం జగన్ సర్కార్ కు అవమానం అని వ్యాఖ్యానించిన ఆయన… ముఖ్యమంత్రి జగన్ కు పౌరుషం ఉంటే వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మాటలు చాలవా.. జగన్ పై వీరికున్న ఉక్రోషాన్ని తెలియపరచడానికి అని పలువురు ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం పనితీరు – కోర్టుల స్పందన అనేది ప్రజాస్వామ్యంలో నిత్యకృత్యం అనే మాటలు వినబడుతున్న తరుణంలో… “మాజీ ప్రత్యక్ష రాజకీయ నాయకుడు”గా తులసీరెడ్డి ఇలా మాట్లాడటం పై ఆయనది అజ్ఞానమా.. ఉక్రోషమా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి!
నిమ్మగడ్డ వ్యవహారం రాజకీయ రంగుపులుముకుని రచ్చ రచ్చ అవుతున్న సంగతి తెలిసిందే. దానికి ప్రభుత్వ విధానమే కారణమా.. నిమ్మగడ్డ ప్రవర్తన కారణమా అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ తెలిసి కూడా… నిమ్మగడ్డ విషయంలో కోర్టు తీర్పుకు – జగన్ సీఎం పదవికీ ముడిపెట్టిన ఆయన రాజనీతిజ్ఞతకు సలాం చేస్తున్నారు తులసీరెడ్డి ఫ్యాన్స్!! ఇక్కడ మరో విషయం ఏమిటంటే… జగన్ “పౌరుషం” గురించి ఏమీ తెలియనట్లుగా, ఆ “పౌరుషం” రుచి చూడనట్లుగా తులసీ రెడ్డి మాట్లాడటం!! నో కామెంట్ ప్లీజ్!