టీడీపీ నేత, ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్సీపీలోకి చేరబోతునట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడైన ఒకరి ద్వారా గంటా రాయబారం నడిపారని.. గంటాను వైసీపీలో చేర్చుకోవడానికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ బలంగా ఉంది. అన్నీ కుదిరితే ఆగస్టు 15న అధికార పార్టీకి జై కొడతారని వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం మేరకు.. గంటా శ్రీనివాసరావు ఆగస్టు 9న ఆయన వైకాపాలో చేరనున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో గంటా శ్రీనివాసరావు ఆగస్టు 9న వైకాపా కండువా కప్పుకోనున్నారు.
కాగా, మొదట్లో టీడీపీ నుంచి తన రాజకీయ భవిశ్యత్ ను ప్రారంభించిన గంటా ఆ తరువాత 2009 లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం అయిన తరువాత కాంగ్రెస్ లో చేరి మంత్రి అయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం తిరిగి టీడీపీలో చేరి భీమిలి నుంచి పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. 2014 నుంచి 19 వరకూ విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2019 లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యే అయ్యారు. అయితే గత కొంతకాలంగా టీడీపీ నాయకత్వంతో అంటీముట్టనట్టుగా గంటా వ్యవహరిస్తున్నారు.