ఏపీసీఎం జగన్‌కు రెండు కీలకమైన సమస్యలు ప్రాణ సంకటంగా మారాయా? ఆయన వాటిని ఇప్పట్లో ఛేదించే అవకాశం కూడా కనిపించడం లేదా? దీంతో ఆయన చివరికి అస్త్రసన్యాసం చేస్తారా? అంటే.. దీనిపై నే పెద్ద ఎత్తున చర్చిస్తున్నామని చెబుతున్నారు వైఎస్సార్ సీపీ నాయకులు. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. జగన్ హవా.. రేంజ్ వేరేగా ఉండేవి. కానీ, అసలు జగనే అధికారంలోకి రావడానికి ఇష్టపడని కొన్ని రాజకీయ శక్తులు.. కొందరు ఓ సామాజిక వర్గానికి చెందిన ప్రబుద్ధుల కారణంగా.. జగన్ రాజకీయ ప్రయాణం ఎలా ఉన్నప్పటికీ.. ప్రభుత్వ ప్రయాణం మాత్రం అడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కి అన్నచందంగా మారిపోయింది.
పేదలకు ఇళ్లు పంపిణీ చేయాలి.. వాటిలో వచ్చే మూడేళ్లలో పక్కా ఆవాసాలు ఏర్పాటు చేయాలి. ఇదీ జగన్ సంచలనం నిర్ణయం. అయితే, ఇది కనుక జరిగిపోతే.. తమ రాజకీయాలకు శాశ్వతంగా తెరపడిపోతుందనేది ఓ వర్గం రాజకీయ నేతల భావన. అంతేకాదు, ఈ ప్రతిపాదన కనుక అమలైతే.. పూర్తిగా తమ నేతలు, పార్టీ కూడా డిఫెన్స్‌లో పడిపోవడం ఖాయం. సో.. దీనిని అడుగడుగునా అడ్డుకుంటున్నారు. ఫలితంగా ఇప్పటికే నాలుగువాయిదాలువేసుకున్న ఈ కార్యక్రమం.. ఇప్పటికీ రూపు దాల్చలేదు.
ప్రస్తుతం ఈ ఇళ్లపై కోర్టుల్లో కేసులు ఉన్నాయి. అవితేలేది ఎప్పుడు? ప్రజలకు ఇళ్లు పంచేది ఎప్పుడు? ఇదో మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇక, జగన్ సంకల్పించిన మరో కీలక నిర్ణయం మూడు రాజధానులు. ఇది అమలైతే.. రాష్ట్రంలో ప్రాంతీయ వాదం తగ్గిపోయి.. రాష్ట్రంలో అన్నిప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందుతాయన్నది జగన్ ప్రయత్నం. అయితే, ఇది కూడా రాజకీయంగా కీలక మలుపులకు అవకాశం ఇచ్చే ప్రధాన ఘట్టం. ఫలితంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీరూపు రేఖలు మారిపోయే అవకాశం ఉంది. మూడు ప్రాంతాల్లోనూ వైఎస్సార్ సీపీ దూకుడు పెరిగిపోయే ఛాన్స్ ఉంది.
ఇక, రాష్ట్రంలో అన్నీ అబివృద్ది మాట అటుంచితే.. తాము ఎన్నో ఆశలు పెట్టుకున్న అమరావతి ఎగిరిపోతోందనే భావన మరింత ఎక్కువగా వీరికి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రతిపాదనకు కూడా అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారు. దీంతో జగన్‌ను మానసికంగా , రాజకీయంగా కూడా కుంగిపోయేలా చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. మరి ఎప్పటికి.. ఈ సమస్యలు పరిష్కారం అవుతాయో చూడాలి.