దేశంలో డిసెంబర్ వరకు కరోనా ప్రభావం తగ్గుతుందని వైద్య నిపుణుడు కక్కిలాయా అన్నారు. డిసెంబర్ వరకు దేశంలోని 40 శాతం మందికి కరోనా సోకే అవకాశం ఉందని అంతర్జాతీయ సైంటిస్టుల అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. అదే సమయం వరకు కరోనా ప్రభావం తగ్గే అవకాశాలు ఉన్నాయన్నారు. మరో 4 నెలల్లో కరోనా ప్రభావం తగ్గుతుందని ఆశించవచ్చని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
అయితే కరోనాకు వ్యాక్సిన్ వచ్చేందుకు ఇంకా సమయం పడుతుందని.. అందువల్ల అప్పటి వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందేనని ఆయన తెలిపారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం చేయాలన్నారు. కరోనా సోకిన 99 శాతం మందికి అసలు చికిత్స అవసరం లేదని, సాధారణ మెడిసిన్ వాడితే సరిపోతుందన్నారు. కేవలం డయాబెటిస్, కిడ్నీ, గుండె సమస్యలు ఉన్నవారికే కరోనా తీవ్రతరం అవుతుందని, అలాంటి వారిలో ముందే లక్షణాలను గుర్తిస్తే వారిని కూడా కరోనా నుంచి కాపాడవచ్చని అన్నారు.
ఇక కరోనా ఇన్‌ఫెక్షన్ రాకుండా ఉంటుందని చెప్పి కషాయాలను అతిగా సేవించరాదని దాంతో అసిడిటీ వస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైంటిస్టుల సూచనల మేరకు స్కూళ్లు, కాలేజీలను తెరవాలన్నారు. కరోనా లాంటి సమయంలో మెడికల్ కాలేజీలను మూసివేయడం సరికాదని, ఆ కళాశాలలను తెరిచి ఉంచితే మెడికల్ విద్యార్థులకు కరోనా పట్ల పూర్తిగా అవగాహన వస్తుందని, దాంతో వారికి భవిష్యత్తులో ఈ విషయంపై మరింత జ్ఞానం ఉంటుందని అన్నారు.