కొవిడ్‌కు మందులేదు.. ధైర్యంగా ఉండటమే ఏకైక మార్గమని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్‌లో ప్లాస్మా దానం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో ప్లాస్మా దానం కార్యక్రమం నిర్వహించారు. కొవిడ్ బారినపడి కోలుకున్న పోలీస్ సిబ్బంది ప్లాస్మా దానం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఈటలతో పాటు… హోం మంత్రి మహమూద్ అలీ, సీపీ అంజనీకుమార్ పాల్గొన్నారు. ప్లాస్మా దానానికి సంబంధించిన వెబ్‌సైట్‌ను ఈటల, మహమూద్ అలీ ప్రారంభించారు.
కరోనాకు ఏకైక మందు ధైర్యమేనని మంత్రి ఈటల అన్నారు. మానవుడు ప్రకృతిని ఎప్పటికీ శాసించలేడని తెలిపారు. కరోనా బాధితులకు మనోధైర్యం కల్పించేలా మనం నడుచుకోవాలని కోరారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల్లో కూడా అనేక మార్పులు తీసుకొచ్చారని చెప్పారు. ప్లాస్మా చికిత్స ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టిందని స్పష్టం చేశారు. కొవిడ్‌కు ఔషధాలతో పాటు ప్లాస్మా చికిత్స కూడా తోడ్పాటును ఇస్తోందని వివరించారు.ప్రపంచ మానవాళికి ప్లాస్మా చికిత్స తోడ్పాటును ఇస్తోందని అన్నారు. అన్ని ఆస్పత్రుల్లో కొవిడ్‌తో పాటు ఇతర వ్యాధులకు చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వైరస్‌తో చనిపోయిన వారి మృతదేహాలను కుటుంబీకులు కూడా తీసుకెళ్లని సందర్భాలు ఉన్నాయని తెలిపారు.